ప్రజా సంతృప్తే లక్ష్యం.. సేవల నాణ్యత పెంచాలి
- కలెక్టర్ స్వప్నిల్
- సంక్షేమ పథకాలు, హాస్టళ్లు, మౌలిక వసతులపై అధికారులకు దిశానిర్దేశం
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామీణ మౌలిక వసతులు, హాస్టళ్ల నిర్వహణపై ప్రజల్లో మరింత సానుకూల దృక్పథం పెంపొందేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో పీపీపీ (పబ్లిక్ పర్సెప్షన్ ప్రోగ్రామ్) డేటా ఆధారంగా సమగ్ర సమీక్ష నిర్వహించారు.
గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వీధిదీపాలు, అంగన్‌వాడీలు, సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై ప్రజాభిప్రాయ గణాంకాలను శాఖల వారీగా పరిశీలించిన కలెక్టర్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) పనితీరును కూడా సమీక్షించారు. ప్రస్తుతం ప్రభుత్వ సేవల పట్ల 88 శాతానికి పైగా ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని, క్షేత్రస్థాయిలో సేవల నాణ్యతను మెరుగుపరిచి ఈ స్థాయిని 95 శాతానికి పెంచాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు.
వినతిపత్రాల పరిష్కారంలో జాప్యం ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తుందని, గడువు దాటిన అర్జీలను పూర్తిగా నివారించి 100 శాతం నాణ్యమైన పరిష్కారం అందించాలని సూచించారు.
గ్రామీణ తాగునీటి సరఫరాలో జిల్లాకు 52.70 శాతం, వీధిదీపాల నిర్వహణలో 64.63 శాతం సానుకూల స్పందన నమోదైందని తెలిపారు. కొన్ని మండలాల్లో పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఐసీడీఎస్ సేవలపై 3 నుంచి 6 ఏళ్ల పిల్లల విభాగంలో 72.66 శాతం, 6 నుంచి 36 నెలల పిల్లల విభాగంలో 80.58 శాతం సానుకూల స్పందన నమోదైందని పేర్కొంటూ అంగన్‌వాడీ సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చాలని సూచించారు.
హాస్టళ్లలో వసతులు మెరుగుపరచాలి
బీసీ సంక్షేమ హాస్టళ్లలో 70.55 శాతం, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 77.01 శాతం, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 77.38 శాతం, ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 71.63 శాతం, గిరిజన సంక్షేమ హాస్టళ్లలో 70.78 శాతం, గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలల్లో 67.93 శాతం సానుకూల స్పందన నమోదైందని కలెక్టర్ వివరించారు.
కొన్ని మండలాల్లో పీపీపీ స్కోరు తక్కువగా ఉండటంపై స్పందిస్తూ, ప్రతి హాస్టల్‌లో విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన ఆహారం అందేలా క్షేత్రస్థాయి అధికారులు నిరంతర తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా, డీఆర్‌వో విశ్వేశ్వరరావు, సీపీవో, జెడ్పీ సీఈవో, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
