భక్తి సాంప్రదాయం సేవ

  • కనకదుర్గమ్మకు పోలీసుల సారె
  • సారె సమర్పించిన కమిషనర్ రాజశేఖర్ దంపతులు
  • కుటుంబ సమేతంగా వైభవంగా ఊరేగింపు
  • ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన చైర్మన్, ఈవో

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: కనకదుర్గమ్మ వారి ఆషాఢ మాస ఆధ్యాత్మిక వైభవంలో భాగంగా విజయవాడ నగర పోలీసు శాఖ తరఫున శ్రీ కనకదుర్గ అమ్మవారికి బుధవారం సంప్రదాయబద్ధంగా ఆషాఢ సారె సమర్పించారు. నగర పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో గొప్ప ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి పసుపు, కుంకుమలు, చీర, సారె, గాజులు తదితర మంగళ ద్రవ్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇంద్రకీలాద్రికి విచ్చేసిన పోలీసు బృందానికి ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ స్వయంగా ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా పూర్ణకుంభ స్వాగతం, ఆలయ మర్యాదలతో పోలీసు అధికారులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు దంపతులు, డీసీపీ గుణ్ణం రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు, వన్‌టౌన్ సీఐ గుణ రామ్తో పాటు వివిధ విభాగాల పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అమ్మవారి దర్శనం అనంతరం మహామండపం ఆరో అంతస్తులో పోలీసు కుటుంబ సభ్యులందరూ ఆషాఢ సారెను సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనాలు అందించగా పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ ఈవో శీనా నాయక్ లు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు.