ఏటవాలు వంతెనపై వరద నీరు.. నిలిచిన రాకపోకలు
లెండిగూడ వాగును పరిశీలించిన సర్పంచ్..
వంతెన దాటొద్దని హెచ్చరిక
జైనూర్, ఆంధ్రప్రభ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని లెండిగూడ సమీపంలోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగుపై ఉన్న ఏటవాలు వంతెనపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో గురువారం ఉదయం నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సమాచారం తెలుసుకున్న జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడపడప ప్రకాశ్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ వాగు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలను హెచ్చరించారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఈ ఏటవాలు వంతెన వద్ద ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా అధికారులు వంతెన వద్ద నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిశీలనలో నాయకులు ఆడ అమృతరావు, షేక్ ఈసా, సొన్ కాంబ్లె సిద్ధు పాల్గొన్నారు.
