Irregularities-Playground : ఆటలు ఆడొద్దు Andhra Prabha Topo Story

Irregularities-Playground : ఆటలు ఆడొద్దు Andhra Prabha Topo Story

  • పాట‌లు పాడొద్దు
  • త‌ర‌గ‌తి గ‌దే బంధీఖానా
  • ఆట స్థలాలు అంతంతే
  • పార్కింగ్ ప్లేస్ లే క్రీడ ప్రాంగణాలు
  • శశి జైలులో భ‌ట్టీల హింస
  • విద్యాశాఖ క‌ళ్ల‌ప్పగింత‌
  • మౌనం నెల‌వారీ మామూలే

(ఆంధ్రప్రభ, నిఘా విభాగం )

పశ్చిమగోదావరి జిల్లాలోని శశి విద్యాసంస్థలపై తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఫీజులు అధికంగా వసూలు చేయడం, క్రీడా ప్రాంగణాలను బస్సుల పార్కింగ్‌గా మార్చేయడం, రాపిడి చదువుతో పిల్లలను మానసికంగా నలిపేయడం వంటి ఆరోపణలు జోరందుకున్నాయి. తణుకు, దువ్వ, తాడేపల్లిగూడెం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లోని శశి స్కూళ్లు, కళాశాలలపై ఇటీవల కాలంలో విమర్శలు పెరుగుతున్నాయి. నిబంధనలు పాటించని శశి విద్యాసంస్థల తీరుపై ఆంధ్రప్రభ వరుస కథనాలను ప్రచురిస్తుంది. ఆంధ్రప్రభలో వస్తున్న కథనాలపై విద్యార్థి సంఘాల నుంచి, విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వపు విద్యార్థులు సిసి లో జరుగుతున్న అక్రమాలను ఆంధ్రప్రభకు వివరిస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా విద్యను వ్యాపారంగా మార్చేస్తూ రాపిడి చదువులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు తమకు ఏమీ పట్టనట్లు మౌన వహిస్తుండడం శశికి విద్యాశాఖ పలుకుతున్న మద్దతును తెలియజేస్తుంది. శశి విద్యాసంస్థలపై వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తూతూ మంత్రపు చర్యలతోటే విద్యాశాఖ అధికారులు సరిపెడుతున్నారు. జిల్లా అధికారులు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిబంధనలను పాటించని శశి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Irregularities-Playground : ఫీజుల దోపిడీ

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు పరిధులను మించి వివిధ పేర్లతో అదనపు రుసుములు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం గణనీయంగా ఫీజులు పెంచుతూ, తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆన్‌లైన్ తరగతుల సమయంలో కూడా పూర్తి ఫీజులు వసూలు చేసినట్లు గతంలో సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు ప్రయత్నాలు చేసినా అమలులో అస్పష్టతలు, కోర్టు జోక్యాలు కొనసాగుతున్నాయి. ఎక్కడ శశి విద్యా సంస్థల్లో ఫీజుల పట్టిక వివరాలు కనుచూపుమేరలో కనిపించవు.

Irregularities-Playground : పార్కింగ్ స్థలాలుగా

పశ్చిమగోదావరి జిల్లాలోని శశి విద్యా సంస్థల్లో కొన్నిచోట్ల క్రీడా ప్రాంగణాలకు చోటే లేకుండా ఉంది. క్రీడా ప్రాంగణాలు సరిగా లేకపోవడం, ఉన్నవాటిని బస్సులు నిలిపే పార్కింగ్ స్థలంగా ఉపయోగించడం వల్ల విద్యార్థుల శారీరక దృఢత్వం, క్రీడా స్ఫూర్తి దెబ్బతింటున్నాయని స్థానికులు చెబుతున్నారు. పిల్లలు కేవలం తరగతి గదులకే పరిమితమై, ఆటలు, వ్యాయామం లేకుండా జీవిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల సమగ్ర వికాసానికి అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. క్రీడా ప్రాంగణాలు బురదమయంగా మారి ఉండటంతో ఇక్కడ సంచరించడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.

Irregularities-Playground : భ‌ట్టీయం చదువుతో మానసిక ఒత్తిడి

శశి విద్య సంస్థలు రాపిడి చదువు పైనే అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల విద్యార్థుల మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతోంది. పరీక్షల్లో మార్కులు సాధించడానికి మాత్రమే దృష్టి పెట్టి సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, మానసిక దృఢత్వం వంటి అంశాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని తల్లిదండ్రులు, విద్యా విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో ఒత్తిడి, ఆందోళన, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి.
జిల్లా విద్యాధికారులు, ప్రభుత్వం ఈ అంశాలపై సమగ్ర విచారణ చేపట్టి ఫీజుల పారదర్శకత, మౌలిక సదుపాయాలు, విద్యా నాణ్యతను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని తల్లిదండ్రులు, విద్యా కార్యకర్తలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. విద్య కేవలం మార్కులు, పరీక్షలకు పరిమితం కాకుండా విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడాలని వారు అభిప్రాయపడుతున్నారు. శశి వంటి పెద్ద సంస్థలు తల్లిదండ్రుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని జవాబుదారీతనంతో వ్యవహరించాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.