వైద్యరంగంలో చరిత్రాత్మక ఘట్టం
- తొలి రోబోటిక్ తుంటి మార్పిడి శస్త్రచికిత్స
- 74 ఏళ్ల వృద్ధుడికి విజయవంతమైన టోటల్ హిప్ రీప్లేస్మెంట్
- రెండో రోజే నడక ప్రారంభం..
- భవిష్యత్తు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్లదే
- విజయవాడ సాయి భాస్కర హాస్పటల్ వైద్యులు డా. బూసిరెడ్డి నరేంద్రరెడ్డి
విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడ వైద్యరంగంలో అత్యాధునిక సాంకేతికతకు నాంది పలుకుతూ శ్రీ సాయి భాస్కర హాస్పిటల్స్‌లో మాకో స్మార్ట్ రోబోటిక్ విధానంలో టోటల్ హిప్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. విజయవాడలో తొలి రోబోటిక్ తుంటి మార్పిడి శస్త్రచికిత్సగా దీనిని అభివర్ణించారు. అమరావతి మండలం పెనుమాకకు చెందిన 74 ఏళ్ల షేక్ సబ్జాన్ సాహెబ్‌కు ఈ శస్త్రచికిత్స నిర్వహించగా, శస్త్రచికిత్స అనంతరం రెండో రోజే నడవడం ప్రారంభించి, నాలుగో రోజునే డిశ్చార్జ్‌కు సిద్ధమయ్యారు.
ఈ సందర్భంగా సాయి భాస్కర హాస్పిటల్స్ ఎండీ, సీనియర్ ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినప్పటికీ, విజయవాడలో తొలిసారిగా రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్ నిర్వహించడం వైద్యరంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందన్నారు. తుంటి సంధిలో అమర్చే కప్, బాల్, లైనర్, స్టెమ్‌లను ముందుగానే కంప్యూటర్ ఆధారిత ప్రణాళికతో ఖచ్చితమైన కోణంలో అమర్చడం వల్ల అత్యున్నత స్థాయి కచ్చితత్వం సాధ్యమవుతుందని వివరించారు.
శస్త్రచికిత్సకు ముందు సిటీ స్కాన్ ఆధారంగా రోగి శరీర నిర్మాణాన్ని కంప్యూటర్లో విశ్లేషించి, ఇంప్లాంట్ పరిమాణం, కోణం, అమరికను వర్చువల్‌గా ముందుగానే రూపొందిస్తారని తెలిపారు. ఆ ప్రణాళికను అనుసరించి రోబోటిక్ వ్యవస్థ పనిచేయడంతో మానవ తప్పిదాలకు అవకాశం లేకుండా శస్త్రచికిత్స పూర్తి అవుతుందని చెప్పారు. దీంతో కండరాలకు తక్కువ నష్టం, తక్కువ రక్తస్రావం, తక్కువ నొప్పి, తక్కువ వ్యవధిలో శస్త్రచికిత్స, వేగవంతమైన కోలుకోవడం వంటి ప్రయోజనాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.
ఏళ్ల నొప్పికి చెక్.. కొత్త జీవితాన్ని ఇచ్చిన చికిత్స
పేషంట్ షేక్ సబ్జాన్ సాహెబ్ మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా తీవ్ర నొప్పితో అనేక ఆసుపత్రులు తిరిగినా అసలు సమస్య గుర్తించలేదన్నారు. నడవలేని స్థితికి చేరుకుని, కాలు జారి పడిన తర్వాత పరిస్థితి మరింత విషమమైందని తెలిపారు. సాయి భాస్కర హాస్పిటల్స్‌లో పరీక్షలు నిర్వహించగా తుంటి సంధి పూర్తిగా అరిగిపోయినట్లు గుర్తించి రోబోటిక్ శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారని చెప్పారు. శస్త్రచికిత్స అనంతరం నొప్పి పూర్తిగా తగ్గి, తాను తిరిగి స్వయంగా నడవగలుగుతున్నానని, కొత్త జీవితం లభించిన అనుభూతి కలుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు.
రోబోటిక్ సర్జరీ తగ్గిన సమయం..
రోబోటిక్ సాంకేతికతతో శస్త్రచికిత్స సమయం తగ్గడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటు, అధిక బరువు వంటి క్లిష్ట పరిస్థితులున్న వృద్ధులకు కూడా మరింత సురక్షితంగా హిప్ రీప్లేస్మెంట్ చేయడం సాధ్యమవుతోందని డాక్టర్ నరేందర్ రెడ్డి తెలిపారు. రానున్న ఐదేళ్లలో సాధారణ హిప్ రీప్లేస్మెంట్ల స్థానంలో రోబోటిక్ శస్త్రచికిత్సలే ప్రధాన ధోరణిగా మారనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
స్మార్ట్ రోబోటిక్స్‌తో 100 శాతం కచ్చితత్వంతో ఇంప్లాంట్ అమరిక సాధ్యమవడం, రోగులు మరుసటి రోజు నుంచే నడవగలగడం ఆర్థోపెడిక్ వైద్యరంగంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ ఆకాష్ కోగంటి, ఎనర్జీషియా డాక్టర్లు వినయ్ కుమార్ దీపక్ తో పాటు హాస్పటల్ సిబ్బంది ఉన్నారు.
