Fly-Menace-Balakavanipeta : వామ్మో.. 13 ఇళ్ల గ్రామంలో వేలాదిగా ఈగలు….Andhra Prabha Spl Story
Fly-Menace-Balakavanipeta : వామ్మో.. 13 ఇళ్ల గ్రామంలో వేలాదిగా ఈగలు….Andhra Prabha Spl Story
- బాలకవానిపేట కల్లోలం
- ఆహారం, నీటిలో ఈగలే ఈగలు.. గ్రామస్థుల ఆవేదన
- శాశ్వత పరిష్కారానికి ఆదేశాలు.. బాలకవానిపేటలో ముమ్మర చర్యలు
- రంగంలోకి ప్రత్యేక బృందా లు
- నివారణకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం
( కోటబొమ్మాళి, ఆంధ్రప్రభభ (
Fly-Menace-Balakavanipeta : శ్రీకాకుళం జిల్లా బాలకవానిపేటలో ఈగల సమస్య తీవ్రరూపం దాల్చింది. ప్రజల ఇబ్బందులపై స్పందించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక బృందాల ఏర్పాటు, మందుల పిచికారీ, శాశ్వత పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.టెక్కలి మండలం బూరగాం పంచాయతీ పరిధిలోని బాలకవానిపేట గ్రామంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న తీవ్రమైన ఈగల సమస్యపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. గ్రామంలో కేవలం 13 ఇళ్లు ఉన్నప్పటికీ, వేలాదిగా ఈగలు దండెత్తి ప్రజలను నరకయాతనకు గురిచేస్తున్న ఉదంతంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నివాసాల్లోకి దూరి ఆహార పదార్థాలు, తాగునీటిలో ఈగలు పడిపోతుండటంతో గ్రామస్థులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్న వైనంపై మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు.
ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఫోన్ లో మాట్లాడారు. బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్ట్యా, గ్రామంలో తక్షణమే ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని రంగంలోకి దించాలని ఆదేశించారు. ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈగల బెడద భవిష్యత్తులో మరలా పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, ప్రస్తుత నివారణ కోసం అవసరమైన రసాయన మందులను పెద్ద ఎత్తున పిచికారీ చేయించాలని అధికారులకు సూచించారు.
మరోవైపు, క్షేత్రస్థాయిలో సమస్య తీవ్రతను తగ్గించేందుకు పంచాయతీ కార్యదర్శి బాబూరావు ఆధ్వర్యంలో గ్రామంలో ఇప్పటికే ప్రత్యేక మందుల పిచికారీ ప్రక్రియను ప్రారంభించారు. బాధితులకు ఊరట కలిగించేలా అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ ముమ్మర చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
