మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
- నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి, ఆంధ్రప్రభ:
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు.సంగారెడ్డి పట్టణంలోని 22వ వార్డు రామ్‌నగర్‌లో గ్రామైక్య మహిళా సంఘ సభ్యులకు ఇందిరమ్మ చీరలను ఆమె పంపిణీ చేశారు. స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో రామ్‌నగర్‌లోని రామ్ మందిర్ సమీపంలో ఉన్న ఆమె స్వగృహంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పిస్తోందని తెలిపారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.ఇందిరమ్మ పథకం ద్వారా మహిళలకు నాణ్యమైన చీరలను అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన చీరల నాణ్యతపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారని, ప్రస్తుతం అందజేస్తున్న చీరలు మహిళలకు ఉపయోగకరంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కూన వనితా సంతోష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అశోక్ రెడ్డి, వార్డు నాయకురాలు కల్పన, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
