Singapore Open | సింగపూర్ ఓపెన్ మనదే..

Singapore Open | సింగపూర్ ఓపెన్ మనదే..

  • సంచలన విజయంతో హిస్టరీ క్రియేట్ చేసిన సాత్విక్-చిరాగ్ ద్వయం!

భారత స్టార్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జంట సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఉత్కంఠభరితంగా సాగిన సింగపూర్ ఓపెన్ (BWF సూపర్ 750) మెన్స్ డబుల్స్ ఫైనల్లో ఈ జోడి అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో మాజీ ప్రపంచ నంబర్ 1 జోడి అయిన సాత్విక్-చిరాగ్.. ఇండోనేషియాకు చెందిన ప్రపంచ నంబర్ 3 జోడి ఫజర్ అల్ఫియాన్ – ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రిపై ఘన విజయం సాధించి, తమ కెరీర్‌లో తొలిసారి సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను ముద్దాడారు.

దాదాపు గంటా 13 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో భారత జోడి 18-21, 21-17, 21-16 తేడాతో ఇండోనేషియాపై అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చి విజయం సాధించింది.

చరిత్ర సృష్టించిన భారత ద్వయం

ఈ విజయంతో సింగపూర్ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ జోడిగా సాత్విక్-చిరాగ్ రికార్డులకెక్కారు. కామన్వెల్త్, ఆసియా క్రీడల ఛాంపియన్లయిన వీరికి ఇది తొలి సింగపూర్ ఓపెన్ టైటిల్ కావ‌డం విశేషం. కాగా, ఈ అద్భుత విజయంతో వారు తమ కెరీర్‌లో 9వ వరల్డ్ టూర్ కిరీటాన్ని ఖాతాలో వేసుకోవడమే కాకుండా, మూడవ సూపర్ 750 టైటిల్‌ను కూడా కైవసం చేసుకున్నారు.

రెండేళ్ల నిరీక్షణకు తెర..

సాత్విక్-చిరాగ్ జోడి చివరిసారిగా 2024లో థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత నాలుగు టోర్నమెంట్లలో ఫైనల్స్ చేరినప్పటికీ రన్నరప్‌గా మాత్రమే నిలిచారు. ఎట్టకేలకు ఈ విజయంతో వారి రెండేళ్ల టైటిల్ కరవు తీరింది.

Singapore Open

Leave a Reply