యువత ఆరోగ్యమే దేశ భవిష్యత్
యువత ఆరోగ్యమే దేశ భవిష్యత్
మిషన్ హెల్తీ భారత్ కు శాప్ మద్దతు
ఒబేసిటీ ముక్త్ భారత్ లక్ష్యంతో దేశవ్యాప్తంగా చైతన్యం
16 రాష్ట్రాలు, 300 నగరాల్లో ప్రచారం
10 లక్షల యువతకు అవగాహన
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : విజయవాడలో మిషన్ హెల్తీ భారత్ కార్యక్రమానికి శాప్ చైర్మన్ రవి నాయుడు మద్దతు ప్రకటిస్తూ, యువత ఆరోగ్యమే దేశ అభివృద్ధికి మూలాధారం అని స్పష్టం చేశారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో బుధవారం మిషన్ హెల్తీ భారత్ వ్యవస్థాపకురాలు తాప్సి ఉపాధ్యాయను శాప్ చైర్మన్ రవి నాయుడు అభినందించారు. దేశ భవిష్యత్తు యువత ఆరోగ్యంపై ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు.
ఒబేసిటీ ముక్త్ హెల్తీ భారత్ లక్ష్యంతో కొనసాగుతున్న ఈ ఉద్యమం సమయానుకూలమైందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఆరోగ్యంపై అవగాహన పెంపు దిశగా మిషన్ హెల్తీ భారత్ చేపడుతున్న కార్యక్రమాలు విశేషంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఒబేసిటీ ముక్త్ భారత్ – ఇండియా టూర్ ద్వారా 16 రాష్ట్రాలు, 300కు పైగా నగరాల్లో విస్తృత ప్రచారం నిర్వహించి, 10 లక్షలకు పైగా యువతను చైతన్యపరిచిన విషయం గొప్ప విజయంగా కొనియాడారు.

అదేవిధంగా సంపూర్ణ భారత్ యాత్ర వంటి కార్యక్రమాలు ఆరోగ్య చైతన్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని చెప్పారు. ఓ ఎం జి కార్యక్రమం ద్వారా యువతతో పాటు క్రీడాకారులను కూడా ఆరోగ్య ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం అభినందనీయమని రవి నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో వేగంగా పెరుగుతున్న ఒబేసిటీ సమస్యను ఎదుర్కోవాలంటే యువత ముందుండి బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆరోగ్యవంతమైన భారత నిర్మాణం కోసం ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) పూర్తి మద్దతు అందిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడలు ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు.
