ap | అమరావతిపై విషం చిమ్మితే సహించం..!
ap | అమరావతిపై విషం చిమ్మితే సహించం..!
11 సీట్ల తీర్పు కూడా బుద్ధి చెప్పలేదా..?’
చంద్రబాబు ఖ్యాతి చూసి తట్టుకోలేకపోతున్నా వైసీపీ
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు ఇక సాగవు
తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుధ్దా వెంకన్న..
ap | ఆంధ్రప్రభ భవానిపురం : అమరావతిపై విషం చిమ్మె మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఘాటుగా హెచ్చరించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న ప్రతిపక్ష వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు. అమరావతి నేడు అభివృద్ధి పరుగులు పెడుతోందని, ఇది చూసి ఓర్వలేక కొందరు వైసీపీ నేతలు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని ఆరోపించారు.
అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాదని, అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బలమైన ఆర్థిక కేంద్రం అని స్పష్టం చేశారు. గత పాలనలో రాష్ట్రం పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల్లో వెనుకబడిందని విమర్శించిన ఆయన, ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వంపై దేశ, విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందన్నారు. అభివృద్ధి కనిపిస్తుంటే దాన్ని అంగీకరించకుండా రాజకీయ విమర్శలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంపై, అమరావతిపై విష ప్రచారం చేస్తే రాజకీయంగా గట్టి సమాధానం తప్పదని హెచ్చరించిన వెంకన్న, ప్రజల తీర్పును గౌరవించి ప్రతిపక్షాలు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించే నాయకులకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. విజయ సాయి రెడ్డి కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలిచే అవకాశం లేదన్న ఆయన, సాయి రెడ్డి డిజిటల్ ఛానల్ పెడితే తాను కూడా అదే రోజు తన సొంత ఛానల్ ను ప్రారంభిస్తానని ప్రకటించారు.

