Earth Science | భూమి అంతర్భాగ రహస్యాలు

Earth Science | భూమి అంతర్భాగ రహస్యాలు

Earth Science | జియోఫిజిక్స్‌తో భూగర్భ సంపద అన్వేషణకు కొత్త దారి
కొక్కంటిలో ప్రత్యేక అధ్యయనం.. భూకంపాలపై పరిశోధన
తవ్వకాలు లేకుండానే భూగర్భ నిక్షేపాల గుర్తింపు

Earth Science | శ్రీసత్యసాయి, ఆంధ్రప్రభ బ్యూరో: భూమి అడుగున ఏముంది? ఎక్కడ ఖనిజ సంపద ఉంది? ఎక్కడ చమురు, సహజవాయువు నిల్వలు ఉన్నాయి? ఏ ప్రాంతంలో భూగర్భ జలాలు సమృద్ధిగా లభిస్తాయి? భూకంపాలకు కారణాలు ఏమిటి? వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను అందించే ఆధునిక శాస్త్రమే జియోఫిజిక్స్ (భూభౌతిక శాస్త్రం).

భౌతిక శాస్త్ర సూత్రాలను ఉపయోగించి భూమి అంతర్గత నిర్మాణాన్ని అధ్యయనం చేసే ఈ శాస్త్రం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సహజ వనరుల అన్వేషణ నుంచి భూకంపాల అధ్యయనం వరకు, భారీ నిర్మాణాల ప్రణాళిక నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు అనేక రంగాల్లో జియోఫిజిక్స్ కీలక పాత్ర పోషిస్తోంది.

దీనికి సంబంధించి ఐదు రోజులుగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇద్దరు సభ్యులతో కూడిన ప్రత్యేక అధ్యయన బృందం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండలం కొక్కంటి పరిసర ప్రాంతంలో అధ్యయనం చేస్తోంది. ఈ ప్రాంతంలో దశాబ్దం క్రితం, ముఖ్యంగా కొక్కంటి ప్రాంతంలో భూమి కంపించి, విచిత్రమైన శబ్దాలు వినిపించేవి. దీంతో ఆ పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో ఈ జియోఫిజిక్స్ అధ్యయనం ఐదు రోజులుగా చేపట్టినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు నాలుగు నెలల క్రితం ప్రత్యేకంగా హెలికాప్టర్ ద్వారా కూడా కదిరి ప్రాంతంలోని పలు నిక్షేపాలపై జాతీయ సర్వే సంస్థ సర్వే చేసింది.

సాంప్రదాయ పద్ధతుల్లో భూమిలో ఏముందో తెలుసుకోవాలంటే తవ్వకాలు చేపట్టాల్సి వచ్చేది. అయితే ఆధునిక జియోఫిజికల్ సాంకేతికతతో భూమిని తవ్వకుండానే భూగర్భంలో ఉన్న ఖనిజాలు, చమురు, సహజవాయువు, భూగర్భ జలాలు, శిలల నిర్మాణం వంటి వివరాలను గుర్తించడం సాధ్యమవుతోంది. దీంతో అన్వేషణ వ్యయం తగ్గడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతోందని పరిశోధకులు అంటున్నారు.