Gold Price Today | తగ్గుతున్న బంగారం ధరలు.. పెరుగుతున్న అమ్మకాలు
Gold Price Today | తగ్గుతున్న బంగారం ధరలు.. పెరుగుతున్న అమ్మకాలు
Gold Price Today | ఆల్‌టైమ్ గరిష్ఠం నుంచి దిగొస్తున్న బంగారం ధరలు
పాత బంగారం అమ్మకాలకు ఎగబడుతున్న గృహస్తులు
ఫెడ్ ప్రభావం.. బంగారం మార్కెట్‌పై పెరుగుతున్న ఒత్తిడి
Gold Price Today | న్యూఢిల్లీ: మొన్నటి దాకా చిక్కను.. చిక్కను అంటూ పరుగులు తీసిన పుత్తడి, ఇప్పుడు పట్టుకోండి చూద్దాం అంటోంది. బంగారం ఇక కొనగలమా.. నగానట్రా కోరికలు కలలేనా అని దిగాలుపడిన భారతీయ గృహస్తులకు దిగొస్తున్న పసిడి ధరలు ఒకింత ఆనందంతోపాటు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంకా ఇంకా ధరలు తగ్గుతాయనే ప్రచారంతో బంగారం కొనే సంగతి అటుంచితే, తమ వద్ద ఉన్న పాత బంగారాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు. గత కొద్దిరోజులుగా దేశీయ బులియన్ మార్కెట్లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది.
ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిల నుంచి బంగారం ధరలు మెల్లమెల్లగా దిగొస్తున్నాయి. ఈ ఏడాది మార్చి ఆరంభంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1.70 లక్షలకు చేరింది. అక్కడి నుంచి తిరోగమించడం ప్రారంభించింది. రాబోయే రోజుల్లో రూ.20-30 వేల వరకు తగ్గొచ్చని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1.43 లక్షలుగా ఉంది. పసిడి ధరలు మరింత తగ్గొచ్చనే అంచనాలతో గృహస్తులు తమ పాత బంగారాన్ని అమ్మి సొమ్ము చేసుకునేందుకు ఎగబడుతున్నారు.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతీయ గృహస్తులు సుమారు 50 టన్నుల బంగారాన్ని విక్రయించినట్లు ఇండియా బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) వెల్లడించింది. గతేడాదితో పోల్చితే ఇది 43 శాతం అధికం. ఈ పరిణామం దేశంలోని గోల్డ్ రీసైక్లింగ్ ఇండస్ట్రీకి ఉత్తేజాన్నిస్తోంది. ఇన్నాళ్లు లాకర్లలో భద్రంగా ఉంచబడిన బంగారం బిస్కెట్లు, ఆభరణాలు తిరిగి ఆర్థిక వ్యవస్థలో చేరిపోతున్నాయి. పాత ఆభరణాలను కరిగించి, స్వచ్ఛమైన బంగారంగా మార్చేసి జువెల్లరీ తయారీదారుల వద్దకు తరలిస్తున్నారు.
ఇటీవలి సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు ఫలించింది. గోల్డ్ దిగుమతులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 72.4 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతులు జరిగాయి. ఇక రీసైకిల్ చేసిన గోల్డ్ 200-250 టన్నుల వరకు ఉంటుందని అంచనా. భారతీయ గృహస్తుల వద్ద మొత్తంగా 30 వేల టన్నుల బంగారం ఉందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో 25-40 శాతం లాకర్ల నుంచి మార్కెట్లోకి వస్తే దిగుమతులపై ఒత్తిళ్లు గణనీయంగా తగ్గుతాయని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
తగ్గుతున్న ధరలు.. ఫెడ్ ప్రభావం
2025లో రాకెట్ వేగంతో పెరిగిన బంగారం ధరలు పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి తీవ్ర ఒడుదొడుకులకు గురవుతున్నాయి. ఆభరణాల కోసం బంగారాన్ని కొనే వారితో పాటు, పెట్టుబడి సాధనంగా భావించి కొనేవారు కూడా దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. పెట్టుబడి కోసం బంగారాన్ని కొన్న వారికి ఇప్పటి వరకు మంచి రాబడులు అందించింది.
కొద్ది రోజులుగా బంగారం ధర దిద్దుబాటుకు లోనవుతోంది. ధర మరింత తగ్గుతుందని మార్కెట్ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలంలో మళ్లీ బంగారం ధరలు పెరుగుతాయని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ధరలు పతనమవుతున్నందున కొంతమంది తమ వద్ద ఉన్న పాత బంగారాన్ని విక్రయిస్తున్నారు. మరికొంత కాలం వేచి చూస్తే మరింత లాభాన్ని కోల్పోతామని వీరు భావిస్తున్నారు.
అంతర్జాతీయంగా ఇటీవల కాలంలో బంగారం ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు, అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలు బంగారం ధరలు పతనమయ్యేందుకు కారణమని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా వడ్డీ రేట్లు పెరిగితే సాధారణంగా బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి. బాండ్లలోకి పెట్టుబడులు పెరుగుతాయి. లాకర్ల నుంచి బంగారం మార్కెట్లోకి రావడం మంచిదేనని భావిస్తున్నారు.
