Social Media | సోషల్ మీడియా.. సమాచార విప్లవమా? లేక అబద్ధాల ప్రవాహమా?
Social Media | సోషల్ మీడియా.. సమాచార విప్లవమా? లేక అబద్ధాల ప్రవాహమా?
ప్రధాన మీడియాకు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా
మారుతున్న జర్నలిజం ముఖచిత్రం!
నేడు సోషల్ మీడియా డే
Social Media | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయాన్నే లేవగానే కాఫీ కప్పుతో పాటు చేతిలోకి వచ్చే మొదటి వస్తువు స్మార్ట్ ఫోన్. ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా, అది క్షణాల్లో మన అరచేతిలోకి వచ్చేస్తోంది. అవును, నేడు సోషల్ మీడియా దినోత్సవం సమాచార ప్రసార వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఈ సోషల్ మీడియా.. ఆధునిక సమాజానికి ఒక అనివార్యమైన శక్తిగా మారింది. సామాజిక మాధ్యమాల ప్రభావం నేటి సమాజంపై రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతుంది. దూరదర్శన్ లో వార్తలు వినడం, ఆపై ప్రసార మాధ్యమాల ద్వారా వార్తలు చూసేవాళ్లం, కానీ ఇప్పుడు ఏ సమాచారం అయినా సోషల్ మీడియా క్షణాల్లో అందిస్తుంది. ఏ సమాచారం అయినా మన వరకు వచ్చిందా.. ఆపై దాన్ని అన్నీ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో షేర్ చేశామా.. అంతే అక్కడితో చేతులు దులుపుకోవడం నేటి సమాజానికి పరిపాటిగా మారింది. అయితే నిజానిజాలను తెలుసుకునేందుకు మాత్రం ఎవ్వరి దగ్గర టైం ఉండదు. ఎవ్వరు అవునన్నా, కాదన్నా… సోషల్ మీడియా మాత్రం రాకెట్ వేగంతో దూసుకువెళ్తుంది. అదే సమయంలో ప్రధాన మీడియా అధికార పక్షం కొమ్ముకాస్తుంటే.. సోషల్ మీడియా మాత్రం సమాజంలో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలను వెళికితీస్తుంది. అసలైన నిఖార్సైన జర్నలిజాన్ని సామాజిక మాధ్యమాల వేదికల ద్వారా యువత నేటి సమాజానికి పరిచయం చేస్తుంది.
జనాల్లోకి వేగంగా..
ఒకప్పుడు వార్త అంటే రేడియోలో వినడం, లేదా మరుసటి రోజు ఉదయం వార్తాపత్రిక రావడం. ఆ తర్వాత టెలివిజన్ వార్తలు వచ్చాయి. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక సంఘటన జరిగిన క్షణాల్లోనే అది ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), వాట్సాప్ వంటి వేదికల ద్వారా ప్రపంచం నలుమూలలా వ్యాపిస్తోంది. మీడియా సంస్థల కంటే ముందే సాధారణ పౌరులే జర్నలిస్టులుగా మారి సమాచారాన్ని అందిస్తున్నారు.
వేగం పెరిగింది.. విచక్షణ తగ్గిందా
సోషల్ మీడియా కల్పించిన ఈ వేగం ఎంతో ప్రయోజనకరమైనదే, కానీ దీనివల్ల ఎదురవుతున్న సమస్యలు కూడా తక్కువేం కాదు. ఏదైనా వార్త కంట పడగానే దాని సత్యనిజాలను పరిశీలించకుండానే ‘షేర్’ బటన్ నొక్కడం నేటి సమాజంలో ఫ్యాషన్‌గా మారింది. తప్పుడు సమాచారం, పుకార్లు ప్రబలడానికి ఇదే ప్రధాన కారణం. “వార్త నా వరకు వచ్చింది, నేను పదిమందికి పంచాను, నా బాధ్యత తీరిపోయింది అనే ధోరణి ప్రమాదకరమైనది. డిజిటల్ యుగంలో వేగం ఎంత ముఖ్యమో, నిజాయితీ అంతకంటే ముఖ్యం అని మనం గుర్తించాలి.
ప్రధాన మీడియాకు ప్రత్యామ్నాయంగా..
ఒకప్పుడు వార్తా సంస్థలు ప్రసారం చేసేదే వేదం. కానీ, నేడు ప్రధాన స్రవంతి మీడియా కొన్నిసార్లు అధికార పక్షానికి కొమ్ముకాస్తూ, నిజాలను వక్రీకరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో, సమాజంలో పేరుకుపోయిన ఎన్నో సమస్యలను, అణగారిన వర్గాల గొంతులను సోషల్ మీడియా బయటకు తీస్తోంది. పాలకుల తప్పులను ఎండగట్టడంలో, సామాన్యుడి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. యువత నేడు సోషల్ మీడియాను కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, ఒక బాధ్యతాయుతమైన వేదికగా ఉపయోగిస్తోంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలను వీడియోల రూపంలో, కథనాల రూపంలో ప్రపంచానికి చూపిస్తూ నిఖార్సైన జర్నలిజంకు కొత్త నిర్వచనాన్ని ఇస్తున్నారు.
బాధ్యతాయుతమైన భాగస్వామ్యం
సోషల్ మీడియా అనేది ఒక కత్తి వంటిది. దానితో సమాజానికి మేలు చేయవచ్చు లేదా అశాంతిని వ్యాప్తి చేయవచ్చు. మన చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ కేవలం సమాచారాన్ని స్వీకరించడానికే కాదు, సరైన సమాచారాన్ని సమాజానికి అందించడానికి కూడా ఉపయోగపడాలి.
