Tension in Tirupathi – ర్యాలీగా గోశాలకు వెళుతున్న భూమనను అడ్డుకున్నపోలీసులు – ఇంటి వ‌ద్దే బైఠాయించి నిరసన

తిరుపతి: తిరుమల గోశాల వద్దకు గురువారం వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి రావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సవాల్ విసిరారు. దీంతో ప్రతి సవాళ్లతో తిరుపతి లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు నేతలతో శాంతి ర్యాలీ నిర్వహించి కరుణాకర్ రెడ్డి చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కూటమి నేతలు పిలుపిచ్చారు.

కాగా, టిటిడి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, వైసిపి కార్యకర్తలతో కలిసి ఎస్వీ గోశాలకు బయలుదేరిన భూమనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసిపి కార్యకర్తలు పోలీసులపై తిరగబడి వాగ్వాదానికి దిగారు. భూమ‌న ప‌రిమిత సంఖ్య‌లో నేత‌ల‌తో గోశాల‌కు వెళితే అనుమ‌తిస్తామ‌ని పోలీసులు తేల్చి చెప్పారు.. మూకుమ్మ‌డి ర్యాలీల‌ను అనుమ‌తి లేద‌న్నారు.. దీంతో భూమ‌న త‌న అనుచ‌రుల‌తో త‌న ఇంటి వ‌ద్దే నిర‌స‌న‌కి దిగారు..

ఈ నేప‌థ్యంలో కూట‌మి నేత‌లు గోశాల‌ను నేడు సంద‌ర్శించారు… వైసిపి నేత‌లు ఇక్క‌డ కు వ‌చ్చి ప‌రిస్థితులు ప‌రిశీలించాల‌ని వారు డిమాండ్ చేశారు.

ఇక‌ తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు గుంపులుగా రావద్దని వైసీపీ నేతలకు తిరుపతి పోలీసుల సూచించారు. టీటీడీ గోశాలలో గోవుల మృతికి సంబంధించి కూటమి ప్రజా ప్రతినిధులు.. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సవాళ్లపై పోలీసు శాఖ నేడు ఈ ప్రకటన విడుదల చేసింది. కార్యకర్తలతో కాకుండా గన్ మెన్‌లతో గోశాలను సందర్శించి, మీడియాతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకరరెడ్డికి పోలీసులు సూచించారు. శాంతి ర్యాలీ పేరుతో వందలాది కార్యకర్తలతో కాకుండా గన్ మెన్ లతో‌ గోశాలను సందర్శించి మీడియాతో మాట్లాడవచ్చని కూటమి ఎమ్మెల్యేలు, నాయకులను పోలీసులు కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా టీటీడీ గోశాలల్లో మూగ జీవాల మృతిపై రాజకీయ రగడ జరుగుతోంది. వైసీపీ , కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

ఇది ఇలా ఉంటే మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వారి పీఏలు, గన్ మేన్‌లు మాత్రం గోశాల వద్దకు రావచ్చని, శాంతి భద్రతలకు విఘాతం కల్పించవద్దని ప్రభుత్వ అధికారులు కోరారు. దీంతో మంత్రులు, ప్రజా ప్రతినిధులు గోశాల సందర్శన ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని కూటమి నేతలు మార్చుకున్నారు. గత ప్రభుత్వంలా వ్యవహరించకుండా, ప్రజాస్వామ్యయుతంగానే పాలన అందించాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఒకే సమయంలో అధికార, ప్రతిపక్షాలు గోశాల సందర్శనకు వద్దని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు సూచించారు. ఎవరినీ గృహ నిర్భందం చేయలేదని ఎస్పీ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా గోశాలను ఏ పార్టీ నేతలైనా సందర్శించవచ్చునని ఆయన అన్నారు.

Leave a Reply