12వ రోజుకు చేరిన ఐకేపీ వీఓఏల సమ్మె

కడెం, ఆంధ్రప్రభ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం), సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ) వీఓఏలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది.

‘తెలంగాణ రాష్ట్ర ఐకేపీ, సెర్ప్ వీఓఏల జాయింట్ యాక్షన్ కమిటీ’ పిలుపు మేరకు ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా నిరవధిక సమ్మె చేపడుతున్నారు. ఇందులో భాగంగా కడెం మండల ఐకేపీ వీఓఏల ఆధ్వర్యంలో కడెం ఐకేపీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో శనివారం 12వ రోజు సమ్మె నిర్వహించారు.

ఈ సందర్భంగా వీఓఏలు మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ఐకేపీ వీఓఏ ఎంప్లాయీస్ అసోసియేషన్ కడెం మండల అధ్యక్షుడు బుక్య విక్రమ్, మండల నాయకులు పోతరాజుల లావణ్య, చేనేని రవి మాట్లాడుతూ వీఓఏలకు నెలకు రూ.20 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.

అలాగే తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయాలని, రూ.10 లక్షల ప్రమాద, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఐకేపీ వీఓఏలు పాల్గొన్నారు.