ఘోర రోడ్డు ప్రమాదం… అన్నదమ్ములకు తీవ్రగాయాలు…
ముప్పాళ్ళ, జులై 28 (ఆంధ్రప్రభ) : పల్నాడు జిల్లా, ముప్పాళ్ళ మండలం, ముప్పాళ్ళ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత రాష్ట్ర రహదారి-322పై మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన ట్రాలీ ఆటోలో సత్తెనపల్లి నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్న యర్రసాని జోసఫ్ కుమార్, యర్రసాని ఏబోజు అనే అన్నదమ్ములు ప్రయాణిస్తుండగా, ఎదురుగా నరసరావుపేట నుంచి సత్తెనపల్లి వైపు వస్తున్న శంకర్ నడుపుతున్న కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు తీవ్రంగా గాయపడగా, ఇద్దరికీ కాళ్లు విరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషిన్ ప్రసన్న కుమార్ వెంటనే స్పందించి ఘటనాస్థలికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి క్షతగాత్రులను సత్తెనపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించి, ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
