వలందపాలెం రామాలయ పునర్నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన

వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభమైన ఆలయ నిర్మాణ పనులు.. దాతలు సహకరించాలని పిలుపు

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలోని మూడో డివిజన్ వలందపాలెం కొట్టేవారి వీధిలో వందేళ్ల చరిత్ర కలిగిన “మన రామాలయం” పునర్నిర్మాణానికి గురువారం ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పురోహితులు శాస్త్రోక్తంగా హోమాలు, పూజలు నిర్వహించి శంకుస్థాపన, కలశ స్థాపన చేపట్టారు.

ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మాట్లాడుతూ హిందూ బంధువులు పాత దేవాలయాల పునర్నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆలయ నిర్మాణానికి దాతలు ఉదారంగా సహకరించాలని కోరారు.

సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ మచిలీపట్నంలో వందేళ్ల చరిత్ర కలిగిన ఈ రామాలయ పునర్నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు కూడా మంజూరు చేయాలని కోరారు. రామాలయ నిర్మాణం చేపట్టే అరుదైన అవకాశం కమిటీకి దక్కిందని అన్నారు.

గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణం సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షుడు మామిడి మురళీకృష్ణ మాట్లాడుతూ నగరంతో పాటు పరిసర గ్రామాల్లోనూ రామాలయాల నిర్మాణం పెరగాలని, ప్రజలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో జనసేన నాయకుడు ఇవన మణిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకుడు శేఖర్, వైఎస్సార్‌సీపీ నాయకులు శీలం బాబ్జి, మాదిరెడ్డి బాబా, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కొట్టే జగన్మోహన్‌రావు, తోట వి.వి.ఎస్. వరప్రసాదరావు, మిరియాల శివాజీ, కొట్టే సత్యనారాయణ, నల్లగోపుల సాయి, దాలిపర్తి నరసింహారావు, ఎర్రోజు సునీల్, బెజ కిరణ్, కొట్టే ఆంజనేయులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.