DK Aruna |పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు?

ఎంపీ డీకే అరుణ

DK Aruna |నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారో ప్రభుత్వం స్పష్టతనివ్వాలని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు.

సోమవారం జిల్లా కేంద్రంలోని సత్యయాదవ్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లు, వార్డుల జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడంలో ఎలాంటి పారదర్శకత లేదని ఆమె విమర్శించారు.

రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా శూన్యమైపోయాయని ఎంపీ ఆరోపించారు.

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తమ నియోజకవర్గాలను ఎలా ప్రోత్సహించుకున్నారో అదే తరహాలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కొడంగల్‌కే అభివృద్ధి పరిమితం చేయడం సరైంది కాదన్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత ఎన్నికలను ఆలస్యం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న మూడు వేల కోట్ల నిధుల విడుదల కోసం హడావుడిగా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందని ఆమె విమర్శించారు.

రెండేళ్లుగా ఇవ్వని ఇందిరమ్మ చీరలను ఎన్నికల ముందు మాత్రమే పంపిణీ చేయడం మహిళలను మరోసారి మోసం చేసే చర్యేనని అరుణ మండిపడ్డారు. ప్రభుత్వం చేనేత చీరలు కాకుండా పవర్ లూమ్స్ చీరలను పంపిణీ చేస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇళ్లు పార్టీ కార్యకర్తలకే కాకుండా అర్హులైన నిరుపేదలకు మంజూరు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల నిధుల్లో ప్రధాని ఆవాస్ యోజన నిధులు కూడా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు. మండలాల విభజనలో సమాన జనాభా ప్రమాణాలను పాటించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అరుణ స్పష్టం చేశారు.

అదేవిధంగా నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో రహదారుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, సీనియర్ నాయకులు నామాజీ నాగురావు, రతంగ్ పాండు రెడ్డి, పగుడాకుల శ్రీనివాస్, కొండయ్య, భాస్కర్, లక్ష్మి, శ్యాంసుందర్, లక్ష్మీకాంత్ రెడ్డి, బలరాం రెడ్డి, రఘురామయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.