మొక్కజొన్న కొనుగోలు లేనట్లేనా..?

మొక్కజొన్న కొనుగోలు లేనట్లేనా..?
రైతాంగాన్ని నట్టేట ముంచిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
రాప్తాడు, ఆంధ్రప్రభ : రభీ సీజన్ లో రైతుల పండించిన మొక్కజొన్న పంటను జిల్లా మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తారా లేదా అనే విషయాన్ని కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ జిల్లా కలెక్టర్ అగ్రికల్చర్ అధికారులు కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.రభీ సీజన్ కూడా దాదాపు ముగిసినట్లే కనిపిస్తోంది. కానీ రైతులు మాత్రం తక్కువ ధరకు మొక్కజొన్నను అమ్ముకోలేక కొందరు పంటను కోత కోయకుండా పంట పొలాల్లోనే అలాగే పెట్టుకున్నారు.
ఇంకా కొద్ది రోజులకయినా కూటమి ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారులు తమకు న్యాయం చేస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక మొక్కజొన్న పంట కోత కోసిన రైతులు దళారుల చేతుల్లో బలైపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి డ్రిప్ స్పింకర్లు మినహాయిస్తే మిగతా ఏ ఒక్క పథకం కూడా రైతులకు సక్రమంగా అందించలేదు. రైతు సేవ కేంద్రాల్లో రైతులకు అవసరమయ్యే ఎరువులు కూడా సరిగా అందుబాటులో లేవు.

అలాగే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. పంటలను మార్క్ ఫెడ్ కొనుగోలు చేయడం లేదు. ఇంత దారుణంగా రైతులను అనేక ఇబ్బందులు పాలు చేస్తూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది.మొక్కజొన్న పంట పండించిన రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నట్టేట ముంచినాయని స్పష్టంగా కనిపిస్తోంది. గత సంవత్సరం మొక్కజొన్న ఒక క్వింటాలు రూ.2000 నుండి 2200 వరకు అమ్మిన రైతులు నేడు క్వింటాలు రూ.1600 నుండి రూ.1700 అమ్ముకుంటున్నారు.
క్వింటాలుకు రూ.500 నుండి రూ.600 నష్టపోతున్నారు. మొక్కజొన్న పంట పండించాలంటే ఒక ఎకరాకు 30 వేల నుండి 40 వేలు ఖర్చు వస్తోందని రైతులు చెబుతున్నారు. ఒక ఎకరాకు 30 నుండి 40 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని అన్నారు.మరి ఇంత నష్టానికి అమ్ముకోవాలంటే చాలా కష్టంగా ఉన్నా కానీ పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీలైనా చెల్లించాలి కాబట్టి పంటను అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తూ దళారులను పెంచి పోషిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయంటున్నారు. దళారుల నుండి పంటలను ప్రభుత్వాలు కొనుగోలు చేసి ఆర్థికంగా లాభం చేకూర్చి వాళ్లను పెంచి పోషిస్తూ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే.ప్రైవేట్ వ్యాపారస్తులే ముఖ్యమనే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతులకు అరా కొరా సహాయ సహకారాలు అందిస్తూ గొప్పలు చెప్పుకుంటున్నాయి.
దయచేసి ఇప్పటికైనా జిల్లా మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న పంటను క్వింటాలు రూ.2400తో కొనుగోలు చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు. లేదా జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పిఎసిఎస్) ఉన్నాయి. వాటికి లైసెన్సులు మంజూరు చేసి రైతులు పండించిన పంటలు కొనుగోలు చేసే బాధ్యతలు అప్పగించాలని జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు.
