అమ్మ ఆలయంలో రాజకీయాలు వద్దు..

  • ఇంద్రకీలాద్రిపై రాజకీయ మాటలపై ఆంక్షలు…
  • అన్ని రాజకీయ పార్టీ నేతలకు ప్రత్యేక విజ్ఞప్తి..
  • ఆదాయం పెంచే మార్గాలు అన్వేషిస్తున్నాం…
  • భక్తుల సౌకర్యాలకు మొదటి ప్రాధాన్యత..
  • కొండపై ఎటువంటి దుకాణాలు ఉండవు…
  • దుర్గగుడి పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ)

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : పూర్తి ఆధ్యాత్మిక చింతన ఉండే కనకదుర్గమ్మ ఆలయంలో రాజకీయ వ్యాఖ్యలు చేయవద్దని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) అన్ని రాజకీయ పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రం నలుమూలల నుండి, విదేశాల నుండి కూడా తరలి వస్తున్న భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంద్రకీలాద్రిపై రాజకీయ ప్రసంగాల‌పై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు.

శుక్రవారం జరిగిన దుర్గగుడి పాలక మండలి సర్వసభ్య సమావేశం తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొర్రా గాంధీ మాట్లాడుతూ, ట్రస్ట్ బోర్డు సభ్యులతో కలిసి ఆలయ ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు.

తొలి పాలకమండలి సమావేశంలో భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయాలు తీసుకున్నామని, మొత్తం 24 అంశాల్లో 18 అంశాలను ఆమోదించామని ఆయన అన్నారు.

డిసెంబర్ 11 నుండి 15 వరకు భవానీ దీక్షా కార్యక్రమాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, భవానీల‌కు ఎలాంటి ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు ఉండ‌వ్వ‌మ‌ని ఆయన అన్నారు.

కొండపై దుకాణాలు ఉండకూడదని తాము నిర్ణయించామని, దుకాణదారులు అధిక రేట్లు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ప‌లు నిర్ణయాలు తీసుకున్నామని ఆయన అన్నారు.

దేవస్ధానమే స్వయంగా రెండు దుకాణాలను ఏర్పాటు చేసి అసలు ధరకే విక్రయించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. కొండపై రాజకీయాల గురించి మాట్లాడవద్దని, ఆంక్షలు ఉన్నాయని పేర్కొంటూ ఆయన పార్టీ నాయకులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

Leave a Reply