రైతులకు భారీ ఊరట.. రూ.2 లక్షలకే అందుబాటులో
- వ్యవసాయంలో డ్రోన్ విప్లవానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం
- రూ.9.8 లక్షల డ్రోన్‌పై రూ.7.8 లక్షల సబ్సిడీ
- డ్రోన్ సేవలతో ఏటా రూ.5 లక్షల వరకు ఆదాయ అవకాశం
- రైతు సంఘాలు, ఎఫ్పీఓలకు అధిక ప్రాధాన్యం
- శిక్షణ, రుణ సదుపాయాలతో డ్రోన్ వినియోగానికి ప్రోత్సాహం
అమరావతి, ఆంధ్రప్రభ: వ్యవసాయంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. డ్రోన్ ఆధారిత సాగు విధానాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో రూ.10 లక్షల విలువైన డ్రోన్లను రూ.2 లక్షలకే రైతులకు అందించాలని నిర్ణయించింది.
ఇందుకోసం రాయితీ పథకాన్ని అమలు చేస్తోంది. కూలీల కొరత, భారంగా మారుతున్న కూలీ ఖర్చులు, సమయాభావం వంటి సవాళ్లను అధిగమించేందుకు డ్రోన్ సాంకేతికతను రైతులకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టింది.
రైతులు చెల్లించాల్సిన రూ.2 లక్షల్లోనూ సగభాగం వరకు బ్యాంకు రుణ సదుపాయం ఉంటుంది. దీంతో రైతులకు ఆర్థిక భారం తగ్గనుంది.
ఇప్పుడు డ్రోన్ రైతుకు అత్యంత నమ్మకమైన వ్యవసాయ సహాయకుడిగా మారుతోంది. విత్తనాలు చల్లడం, ఎరువుల పిచికారీ, పురుగుమందుల స్ప్రేయింగ్, సూక్ష్మపోషకాల పిచికారీ వంటి పనులను వేగంగా పూర్తి చేస్తోంది.
ఆరుగురు కూలీలు రోజంతా చేసే పనిని డ్రోన్ గంట వ్యవధిలోనే పూర్తి చేయగలదు. దీంతో కూలీ ఖర్చు గణనీయంగా తగ్గడమే కాకుండా, పంటలకు సరైన సమయంలో మందులు వేయడం సాధ్యమవుతోంది.
80 శాతం రాయితీ
డ్రోన్ ధర సుమారు రూ.9.8 లక్షలు కాగా ప్రభుత్వం రూ.7.8 లక్షల వరకు సబ్సిడీ అందిస్తోంది. రైతు లేదా రైతు సంఘం కేవలం రూ.2 లక్షలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
ఈ మొత్తంలో కూడా సుమారు 50 శాతం వరకు బ్యాంకు రుణం పొందే అవకాశం ఉంది. వ్యక్తిగత రైతుల కంటే ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఏర్పాటు చేసుకున్న సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పీఓలు), రైతు గ్రూపులకు డ్రోన్ల పంపిణీలో అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
డ్రోన్ నిర్వహించే వ్యక్తి కనీసం ఇంటర్మీడియట్ లేదా ఇంజినీరింగ్ చదివి ఉంటే మరింత ప్రాధాన్యం కల్పిస్తున్నారు.
దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత జిల్లా కేంద్రంలో సుమారు 12 రోజుల ప్రత్యేక శిక్షణ ఇస్తారు. డ్రోన్ ఆపరేషన్, భద్రతా ప్రమాణాలు, నిర్వహణ, పంటలకు సరైన పిచికారీ విధానాలపై పూర్తి అవగాహన కల్పిస్తారు.
రాష్ట్రంలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా డ్రోన్ వినియోగంపై శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తోంది.
ఏటా రూ.5 లక్షల వరకు ఆదాయం
డ్రోన్ సేవలను ఇతర రైతులకు అద్దెకు అందించడం ద్వారా ఏడాదికి సగటున రూ.5 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
దీంతో డ్రోన్ కేవలం వ్యవసాయ పరికరంగా కాకుండా గ్రామీణ యువతకు ఉపాధి సాధనంగా మారనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ కోసం 875 వ్యవసాయ డ్రోన్ యూనిట్ల పంపిణీ లక్ష్యాన్ని నిర్ణయించింది. గ్రామీణ స్థాయిలో కిసాన్ డ్రోన్ ఫార్మ్ మెషినరీ బ్యాంకులు ఏర్పాటు చేస్తూ డ్రోన్ సేవలను విస్తరిస్తోంది.
రాష్ట్రంలో సుమారు 85 లక్షల వ్యవసాయ కుటుంబాలు ఉండటంతో డ్రోన్ సేవలకు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశముందని ప్రభుత్వ అధ్యయనాలు సూచిస్తున్నాయి.
