Hockey Men’s U-18 Asia Cup 2026 | ఆసియా కప్ మనదే!
Hockey Men’s U-18 Asia Cup 2026 | ఆసియా కప్ మనదే!
- మూడోసారి ఆసియా కప్ విజేతగా భారత్
- టైటిల్ కొట్టేసిన భారత యువ జట్టు
- స్వర్ణంతో పురుషుల జట్టు..
- కాంస్యంతో మహిళల జట్టు..
- హాకీలో భారత్ డబుల్ ధమాకా
భారత అండర్-18 పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ 2026లో చరిత్ర సృష్టించింది. జపాన్‌లోని కాకమిగహారాలో జరిగిన ఫైనల్లో ఆతిథ్య జపాన్‌ను 4-1 తేడాతో చిత్తు చేసి రికార్డు స్థాయిలో మూడోసారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఫైనల్లో భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. స్టార్ ఫార్వర్డ్ ఆశిష్ పుర్తి హ్యాట్రిక్ గోల్స్‌తో జపాన్ డిఫెన్స్ ను ఛేదించగా, టీం స్కోర్ కు కెప్టెన్ కేతన్ కుష్వాహా మరో గోల్ జోడించాడు. జపాన్ తరఫున గాకు నుమాడా ఒక్క గోల్ మాత్రమే సాధించగలిగాడు.
ఇటీవలే పాకిస్థాన్‌పై సెమీఫైనల్లో నాలుగు గోల్స్‌తో హీరోగా నిలిచిన ఆశిష్ పుర్తి.. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అతడి అద్భుత ప్రదర్శనతో టైటిల్ పోరులో జపాన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భారత యువ జట్టు విజేతగా నిలిచింది.
మహిళల జట్టుకు కాంస్యం
అంతకుముందు జరిగిన మూడో స్థానం పోరులో భారత అండర్-18 మహిళల జట్టు దక్షిణ కొరియాను 3-0తో ఓడించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆసియా కప్‌లో భారత హాకీకి డబుల్ ఆనందం లభించింది.

