TDP Mahanadu | మహానాడు ఎన్టీఆర్ అందించిన గొప్ప వేదిక

TDP Mahanadu | మహానాడు ఎన్టీఆర్ అందించిన గొప్ప వేదిక

TDP Mahanadu | అండమాన్‌లో టీడీపీ విస్తరణపై మాణిక్యం యాదవ్ వ్యాఖ్యలు
ఎన్టీఆర్‌కు వినూత్న చిత్రాభిషేకం
సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా టీడీపీ
కాపు సామాజికవర్గానికి ప్రభుత్వ పథకాల లబ్ధి

TDP Mahanadu | అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీకి మహానాడు రూపంలో ఓ గొప్ప వేడుకను అందించిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందని ఆ పార్టీ అండమాన్ అధ్యక్షులు మాణిక్యం యాదవ్ అన్నారు. మహానాడు వేదికపై ఆయన ఇలా మాట్లాడారు.

అండమాన్‌లో చంద్రబాబు ఓసారి పర్యటించాలన్నది అక్కడి తెలుగువారి కోరిక అన్నారు. చంద్రబాబు నాయుడు అండమాన్ ద్వీపంలో పాదం మోపితే.. ఈ ప్రాంతం పుణితం అవుతుంది. అండమాన్‌లో తెలుగుదేశం మహాశక్తిగా ఎదుగుతోంది. అండమాన్‌లో పార్టీ తరపున ఎంపీగా గెలవాలనేది ప్రజల ఆకాంక్ష. అండమాన్ నుంచి దేశంలోని మిగతా ప్రాంతాలకు రావాలంటే వ్యయంతో కూడిన పని. అండమాన్ ప్రాంతంలో విమాన, నౌక అనుసంధానం మరింత మెరుగుపరిచి ఇక్కడి ప్రజలకు తోడుగా నిలవాలి. చంద్రబాబు ప్రోత్సాహంతో అండమాన్ అభివృద్ధి జరగాలని అన్నారు.

ఎన్టీఆర్‌కు చిత్రాభిషేకం

• మహానాడు సందర్భంగా ఓ అభిమాని నీరాజనం

నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో: మహానాడు పండుగ సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు, కళారత్న చింతలపల్లె కోటేష్ వినూత్న రీతిలో నందమూరి తారక రామారావుకు నివాళి అర్పించారు. ఎన్టీఆర్‌కు గుర్తుగా 20 చిన్న బొమ్మలు వేశారు. కేవలం 8 అంగుళాల పొడవు, 14 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్ మీద ఎన్టీఆర్ సినిమాల్లో నటించిన చిత్రాలను, వివిధ పాత్రల రూపాలను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేష్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ పేరు ఒక ప్రభంజనం.. ఒక సంచలనం అన్నారు. అందుకే ఆ పేరులోనే ఎన్టీఆర్‌ను బాల్యంలో, సినీ పరిశ్రమలో, యవ్వనంలో ఎలా ఉన్నారో చూపించే ప్రయత్నం చేశానన్నారు. అలాగే సాంఘిక, జానపద పాత్రల్లో కొన్ని, బ్రహ్మనాయుడుగా, శ్రీకృష్ణదేవరాయలుగా, అక్బర్‌గా, పోతులూరి వీరబ్రహ్మంగా, పౌరాణిక పాత్రల్లో శివునిగా, భీష్ముడు, భీముడు, శ్రీకృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు, కర్ణుడిగా, వెంకటేశ్వరస్వామిగా పోషించిన వివిధ పాత్రల చిత్రాలు వేశానన్నారు.

రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో కూడా చూపించానన్నారు. విశ్వం ఉన్నంత వరకు తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌ను మరచిపోరన్నారు. ఆ మహనీయుడిపై అభిమానంతో ఆయన జయంతులు, వర్ధంతులకు ఇలా వినూత్న శైలిలో చిత్రాభిషేకం చేస్తుంటానని చెప్పారు.

సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్

• టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

అమరావతి, ఆంధ్రప్రభ: కూడు, గూడు, గుడ్డ నినాదంతో పేదవాడికి చేయూతనిచ్చింది తెలుగుదేశం పార్టీ అని, సంక్షేమానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చింది ఆ పార్టీయేనని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. మహానాడు వేదికపై ఆయన మాట్లాడుతూ.. 2016లో కాపు సామాజికవర్గానికి అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు సారథ్యంలో బీసీ రిజర్వేషన్ తీర్మానం చేశామన్నారు.

ఉద్యోగాలు పొందడం, ఆర్థిక లబ్ధి, విదేశీ విద్య ద్వారా కాపు సామాజికవర్గం లబ్ధి పొందిందన్నారు. ఎన్టీఆర్ భరోసా కింద కూటమి ప్రభుత్వం రూ.6,702.51 కోట్లు పెన్షన్లు ఇచ్చిందన్నారు. 5 లక్షల మంది కాపు తల్లులకు ‘తల్లికి వందనం’ అందిందన్నారు. కాపు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కింద రూ.724 కోట్లు అందాయని తెలిపారు. దీపం-2 పథకంలో కాపు మహిళలకు 7 లక్షల మందికి రూ.198 కోట్లు లబ్ధి చేకూర్చామని, 25,756 మంది కాపు సామాజికవర్గానికి చెందిన ఆటో డ్రైవర్లకు రూ.38 కోట్లు అందజేశామని చెప్పారు.

Leave a Reply