అతని మృతి అనుమానస్పదం….

ములుగు, (ఆంధ్రప్రభ) : బస్వాపూర్ గ్రామానికి చెందిన నర్సంపల్లి సందీప్ (21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మృతుడి కుటుంబ సభ్యులు, ములుగు ఎస్‌ఐ రఘుపతి వెల్లడించిన విధంగా ఇలా ఉన్నాయి.
సందీప్ శామీర్‌పేట్ మండలం తుర్కపల్లి బి కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం డ్యూటీకి వెళ్లిన అతడు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటికి చేరాడు. అనంతరం కొత్తూరు గ్రామానికి హెయిర్ కటింగ్ కోసం వెళ్తానని చెప్పి సైకిల్ మోటార్‌పై బయలుదేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
చీకటి అయ్యే వరకు ఇంటికి రాకపోవడంతో తల్లి రేణుక ఫోన్ చేయగా, “ఇంకా హెయిర్ కటింగ్ చేయించుకోలేదు” అని సందీప్ చెప్పినట్లు తెలిపారు. అనంతరం రాత్రి 9.30 గంటల సమయంలో తిరిగి ఫోన్ చేసిన తల్లికి సందీప్ “నన్ను కొందరు కొడుతున్నారు” అని చెప్పి ఫోన్‌ను కట్ చేశాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
తర్వాత రాత్రి 10 గంటల ప్రాంతంలో మళ్లీ సందీప్ ఫోన్ చేసి, కొత్తూరు సమీపంలోని పెద్దమ్మగుడి వెనకాల మధు, నందు, అరుణ్, అనిల్ అనే వ్యక్తులు తనను కొడుతున్నారని తెలిపినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. విషయం తెలిసిన వెంటనే వారు అక్కడకు వెళ్లి వెతికినా సందీప్ కనిపించలేదని తెలిపారు.
రోడ్డు వెంట శోధించిన కుటుంబ సభ్యులకు ఒకవైపు సైకిల్ మోటార్, మరోవైపు రక్త గాయాలతో పడి ఉన్న సందీప్ కనిపించినట్లు తెలిపారు. అతని ముఖం, చేతులు, కాళ్లు, ఛాతి వద్ద గాయాలు ఉన్నాయని, ఈ మరణం పై తీవ్ర అనుమానం ఉందని తల్లి రేణుక ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ములుగు ఎస్‌ఐ రఘుపతి తెలిపారు.

