కేజీబీవీ అన్‌స్పెంట్ బడ్జెట్‌లో అక్రమాల ఆరోపణలు

  • ఆర్టిఐతో వెలుగులోకి కేజీబీవీ కొనుగోళ్ల వివరాలు.
  • నిధుల వినియోగంపై విచారణకు డిమాండ్..

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేజీబీవీ పాఠశాలల్లో అన్‌స్పెంట్ బడ్జెట్ వినియోగంలో అవకతవకలు జరిగాయని సమాచార హక్కు చట్ట కార్యకర్త కుసుమ రామకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. పాఠశాలలకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయాలని రాష్ట్ర స్థాయి నుంచి ఆదేశాలు జారీ అయినప్పటికీ, కొందరు సంబంధిత అధికారులు అప్పటి ఆర్థిక విభాగ అధికారులతో కుమ్మక్కై వివిధ బిల్లులు రూపొందించి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బిల్లులకు సంబంధించిన పీపీఏలు బంధువులు, పరిచయస్తులు, అకౌంటెంట్ల పేర్లపై రూపొందించినట్లు తెలిపారు.

సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరగా తొలుత పూర్తి సమాచారం ఇవ్వకుండా తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగినప్పటికీ, అనంతరం సేకరించిన సమాచారంలో లక్షల రూపాయల వ్యయానికి సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు.జిల్లాలోనే అందుబాటులో ఉండే బీరువాలు, టేబుళ్లు, కుర్చీలు తదితర సామగ్రిని హైదరాబాద్‌లోని వ్యాపార సంస్థల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేసి, నాణ్యతలేని వస్తువులు సరఫరా చేశారనే అనుమానాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలు తేలితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కుసుమ రామకృష్ణ డిమాండ్ చేశారు.