students | విద్యార్థుల భవిష్యత్‌కు “ఆరోగ్య పాఠశాల” దిక్సూచి

మన్నూర్ హైస్కూల్‌లో న్యూట్రి గార్డెన్ ప్రారంభించిన కలెక్టర్
ఆంధ్రప్రభ, ఆదిలాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన “ఆరోగ్య పాఠశాల” కార్యక్రమం విద్యార్థుల భవిష్యత్‌కు నిచ్చెన లాంటిదని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా అన్నారు. శుక్రవారం గుడిహత్నూర్ మండలం మన్నూర్ జిల్లా పరిషత్ హై స్కూల్‌లో విద్యార్థుల కోసం పోషక విలువలతో కూరగాయల సాగు (న్యూట్రి గార్డెన్), ఆర్‌వో ప్లాంట్‌ను కలెక్టర్ ప్రారంభించారు. హైస్కూల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద ఉపాధ్యాయులతో కలిసి ఫోటో దిగారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈజీఎస్ పథకంలో మొక్కలు నాటే కార్యక్రమం మొక్కుబడిగా సాగుతుందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కలు నాటడం ఉద్యమంలో చేపట్టాలని సూచించారు. రానున్న ఎస్ఎస్సీ పరీక్షల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులే లక్ష్యంగా విద్యార్థులు ఇప్పటినుంచే కష్టపడాలని, విద్యార్థులు చదువులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆరోగ్య పాఠశాల పనితీరు గురించి 10వ తరగతి విద్యార్థిని వైష్ణవి కలెక్టర్‌కు వివరించారు. పాఠశాల నిర్వహణ తీరు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న గార్డెన్ గురించి కలెక్టర్ ప్రశంసించారు. మన్నూర్ హైస్కూల్లో ప్రతిభ సామర్ధ్యాలు గల “సూపర్ 15 ” విద్యార్థులను అభినందించారు. ఆయన వెంట స్కూల్ హెచ్ఎం సంతోష్ కుమార్, డీఆర్డీఏ పీడీ రవీందర్ రాథోడ్, ఏపీడీ కుటుంబరావు, షెడ్యూల్డ్ కులాల సేవా సంస్థ అధికారిని సునీత, స్కూల్ గైడ్ విట్టల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
