Harassment | క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌పై నటి ఫిర్యాదు
Harassment | క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌పై నటి ఫిర్యాదు
Harassment | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి తనతో అనుచితంగా ప్రవర్తించాడంటూ ఓ సినీ నటి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సినీ రంగంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఓ నటికి ప్రసాద్ అనే క్యాస్టింగ్ ఆర్టిస్ట్ పరిచయమయ్యాడు. ‘ఆకాశంలో ఓ తార’ చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానని చెప్పడంతో ఆమె ఆ సినిమాలో నటించినట్లు తెలుస్తోంది. 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య సినిమా షూటింగ్ పూర్తయిందని సమాచారం.
అయితే సినిమా పూర్తయిన తర్వాత కూడా తనకు ఇవ్వాల్సిన రూ.90 వేల పారితోషికంతో పాటు ప్రయాణ ఖర్చుల కింద చెల్లించాల్సిన రూ.38వేల మొత్తాన్ని ఇవ్వకుండా కాలయాపన చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. పలుమార్లు అడిగినా స్పందన రాలేదని ఫిర్యాదులో పేర్కొంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో బకాయిల విషయమై మాట్లాడుకుందామని బంజారాహిల్స్‌లోని ఓ సినీ నిర్మాత కార్యాలయం వద్దకు పిలిచిన ప్రసాద్, అక్కడ డబ్బులు ఇవ్వకుండా బెదిరించడమే కాకుండా బలవంతంగా కారులో తీసుకెళ్లాడని బాధితురాలు ఆరోపించింది.
అనంతరం మరిన్ని సినిమా అవకాశాలు కల్పిస్తానని చెప్పి తన వ్యక్తిగత కోరికలు తీర్చాలని ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని తన తల్లికి చెప్పగా, ఆమె ఫోన్ చేసి ప్రశ్నించడంతో తనను కూడా దుర్భాషలాడి బెదిరించాడని బాధితురాలి తల్లి ఆరోపించారు.
నిందితుడి నుంచి రక్షణ కల్పించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను కోరారు. ఫిర్యాదు స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
