Ben Stokes | కెప్టెన్సీకి బెన్ స్టోక్స్ గుడ్‌బై..

Ben Stokes | కెప్టెన్సీకి బెన్ స్టోక్స్ గుడ్‌బై..

  • ఇంగ్లండ్ క్రికెట్‌కు షాక్..
  • నైట్‌క్లబ్ వివాదం ఎఫెక్ట్..
  • రిటైర్మెంట్ దిశగా బెన్ స్టోక్స్?
  • కెప్టెన్సీకి గుడ్‌బై.. క్రికెట్‌కూ వీడ్కోలేనా?

ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) భవిష్యత్తుపై అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటీవల జరిగిన నైట్‌క్లబ్ వివాదం నేపథ్యంలో స్టోక్స్ తన టెస్ట్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు స్టోక్స్ గానీ, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇంగ్లండ్ సహచర ఆటగాడు గస్ అట్కిన్సన్‌తో కలిసి జరిగిన నైట్‌క్లబ్ ఘటనపై ఈసీబీ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారం ఇంగ్లండ్ క్రికెట్‌లో పెద్ద చర్చకు దారితీయగా, స్టోక్స్ నాయకత్వ భవిష్యత్తుపై కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విచారణ ఫలితాలను బట్టి ఈసీబీ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని బ్రిటిష్ మీడియా కథనాలు చెబుతున్నాయి.

అంతేకాదు, కెప్టెన్సీకి మాత్రమే కాకుండా స్టోక్స్ టెస్ట్ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికే అవకాశముందంటూ మ‌రికొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం ఇవన్నీ మీడియా కథనాలు, ఊహాగానాలు మాత్రమే. స్టోక్స్ నుంచి లేదా ఈసీబీ నుంచి ఎలాంటి క‌న్ఫ‌ర్మేష‌న్ రాలేదు.

కాగా, 2022లో జో రూట్ తర్వాత ఇంగ్లండ్ టెస్ట్ జట్టు పగ్గాలు చేపట్టిన బెన్ స్టోక్స్, హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌తో కలిసి ఇంగ్లండ్ క్రికెట్‌లో “బాజ్‌బాల్” అనే దూకుడు ఆటశైలికి నాంది పలికాడు. అతని నాయకత్వంలో ఇంగ్లండ్ టెస్ట్ జట్టు సాహసోపేతమైన వ్యూహాలతో ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.

ప్రస్తుతం క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఈసీబీ విచారణ ఫలితాలపైనే ఉంది. స్టోక్స్ కెప్టెన్సీ కొనసాగుతుందా? లేక ఇంగ్లండ్ టెస్ట్ జట్టులో కొత్త నాయకత్వానికి మార్గం సుగమమవుతుందా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

Leave a Reply