అదరగొట్టిన అక్కా చెల్లెళ్ళు..

  • రాష్ట్ర మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గుంటూరు అమ్మాయిల సత్తా
  • స్రవంతి–దీపిక జోడీకి రాష్ట్ర ఛాంపియన్ టైటిల్

గుంటూరు స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గుంటూరుకు చెందిన అక్కాచెల్లెళ్లు స్రవంతి, దీపిక మరోసారి తమ ప్రతిభను చాటుతూ రాష్ట్ర ఛాంపియన్‌లుగా నిలిచారు. అత్యుత్తమ ఆటతీరుతో ప్రత్యర్థులను వరుసగా ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుని గుంటూరు జిల్లా కీర్తిని రాష్ట్రస్థాయిలో మరోసారి ఇనుమడింపజేశారు. పోటీల్లో భాగంగా జరిగిన సెమీఫైనల్‌లో ఫాతిమా–శ్రీనిత్య జోడిపై ఆధిపత్యం ప్రదర్శించిన స్రవంతి, దీపికలు ఫైనల్‌కు అర్హత సాధించారు.

అనంతరం జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో ప్రకాశం జిల్లాకు చెందిన వైష్ణవి–సర్రియీ జోడిపై అద్భుత ప్రదర్శన కనబరిచి విజేతలుగా నిలిచారు. కీలక సమయంలో ఆత్మవిశ్వాసంతో ఆడి రాష్ట్ర మహిళల డబుల్స్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో వరుస విజయాలు నమోదు చేస్తూ స్రవంతి, దీపికలు తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటేందుకు కృషి చేస్తూ గుంటూరు జిల్లాకు మంచి పేరు తీసుకొస్తున్నారు.

రాష్ట్ర ఛాంపియన్‌షిప్ సాధించిన సందర్భంగా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగారావు, కార్యదర్శి సంపత్ కుమార్, సభ్యులు రమేష్, రాము, సతీష్, హరి ప్రత్యేకంగా అభినందించారు. చిన్ననాటి నుంచే వారిలోని ప్రతిభను గుర్తించి ప్రత్యేక శిక్షణ అందించిన ప్రో అకాడమీ కోచ్ కిరణ్ కుమార్‌తో పాటు వివేక్, సుస్వేతలను కూడా ఈ సందర్భంగా అభినందించారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ మరిన్ని విజయాలు సాధించి తెలుగు రాష్ట్రాలకు, దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.