జొన్నగిరి గోల్డ్ మైన్‌కు దశాబ్దాల కృషి ఫలించింది
ప్రాజెక్టు ప్రారంభానికి చంద్రబాబు ప్రత్యేక చొరవే కారణం: ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు
స్థానిక యువతకు ఉపాధి, ప్రాంతీయ అభివృద్ధికి గోల్డ్ మైన్ దోహదం
కోసిగి, ఆంధ్రప్రభ : జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టు ప్రారంభం వెనుక దశాబ్దానికి పైగా సాగిన కృషి, ప్రభుత్వాల సహకారం ఉందని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలిపారు. జొన్నగిరిలో నిర్వహించిన గోల్డ్ మైన్ ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ 2009లోనే ప్రారంభమైందని గుర్తు చేశారు.
అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న కేఈ ప్రభాకర్ ఈ ప్రాజెక్టుకు అవసరమైన సహకారం అందించారని పేర్కొన్నారు. అనంతరం 2014-2019 మధ్య కాలంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కేఈ కృష్ణమూర్తి నాయకత్వంలో వాటర్ రిసోర్సెస్, పర్యావరణ అనుమతులు తదితర అంశాల్లో ప్రభుత్వ సహకారం అందించి ప్రాజెక్టు ముందుకు సాగేలా కృషి చేసినట్లు తెలిపారు.
అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పురోగతి మందగించిందని విమర్శించారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని అన్ని అనుమతుల ప్రక్రియలను వేగవంతం చేయడంతో జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రారంభానికి మార్గం సుగమమైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఉపాధి అవకాశాలకు కొత్త దారి
గోల్డ్ మైన్ ప్రారంభం ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయని శ్యాంబాబు తెలిపారు. ప్రత్యక్ష, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు లభించడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంలో స్థానిక ప్రజల సహకారం ఎంతో కీలకమైందని పేర్కొన్న ఆయన, జొన్నగిరి ప్రాంతాన్ని పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
వర్షాధార ప్రాంతానికి సాగునీటి భరోసా
జొన్నగిరి పరిసర ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా వర్షాధార వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
2014-2019 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రూ.250 కోట్ల వ్యయంతో 68 చెరువులకు నీరు అందించి రైతాంగానికి సాగునీటి భరోసా కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. సాగునీటి వసతుల విస్తరణతో వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని వివరించారు.
పత్తికొండకు హార్టికల్చర్ పైలట్ ప్రాజెక్టు కావాలి
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన లక్ష కోట్ల రూపాయల హార్టికల్చర్ ప్రణాళికలో భాగంగా పత్తికొండ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యే కోరారు. దీనివల్ల ఉద్యానవన పంటల సాగు విస్తరించి రైతుల ఆదాయం పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
జొన్నగిరి గోల్డ్ మైన్, సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యానవన అభివృద్ధి కార్యక్రమాలతో పత్తికొండ ప్రాంతం అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.
