శాకాంబరి అలంకారంలో లలితాదేవి దివ్యదర్శనం
కరీమాబాద్, ఆంధ్రప్రభ: గురు పౌర్ణమి సందర్భంగా కరీమాబాద్ 34వ డివిజన్ శివనగర్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో కొలువైన శ్రీ లలితాదేవి అమ్మవారు బుధవారం శాకాంబరి మాత అలంకారంలో భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో ప్రకృతి మాత స్వరూపంగా అలంకరించిన అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆషాఢ శుద్ధ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఆలయ అర్చకులు బండారు జయశంకర్, బండారు ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో శాకాంబరి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం సామూహిక లలితా పారాయణం, మహా అన్నప్రసాద వితరణ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామచంద్రస్వామి ట్రస్ట్ నిర్వాహకులు, పద్మాలయ పరపతి సంఘం, ఏకలవ్య అన్నదాన ట్రస్ట్ ప్రతినిధులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
