బాసర ఆలయ పునర్నిర్మాణానికి ముహూర్తం ఖరారు
6 నుంచి బాలాలయంలో అమ్మవారి నిత్యపూజలు..
బాసర, నిర్మల్ జిల్లా | చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 4 నుంచి 5 వరకు ప్రధాన ఆలయంలో పునర్నిర్మాణ సంబంధిత ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
శృంగేరి పీఠాధిపతులు అందించిన దేవతా మూర్తులకు ఆలయ వేద పండితులు, అర్చకులు సంకల్పం, గణపతి పూజ, కళాపకర్షణ పూజలు నిర్వహించనున్నారు. అనంతరం శృంగేరి పీఠాధిపతులు అందించిన ఉత్సవ మూర్తులను బాలాలయంలో ప్రతిష్టించనున్నట్లు స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి తెలిపారు.
సోమవారం బాలాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మీ దేవి, మహంకాళి అమ్మవార్ల ప్రతిమలకు ప్రాణప్రతిష్ట నిర్వహించనున్నారు. ఆ తరువాత ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని వారు పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రధాన ఆలయంలో వ్యాసమహర్షి తపస్సుతో ప్రతిష్టితమైన అమ్మవారి విగ్రహం ఉన్నందున అక్కడ నిత్య పూజలు నిలిపివేయకుండా కొనసాగించాలని శృంగేరి పీఠాధిపతి సూచించినట్లు అర్చకులు తెలిపారు. అదే విధంగా బాలాలయంలో కూడా ప్రతినిత్యం నిత్య కైంకర్యాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఆలయ ఈఓ ప్రకటన ప్రకారం సోమవారం నుంచి ప్రధాన ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సేవలను బాలాలయానికి తాత్కాలికంగా మారుస్తున్నట్లు తెలిపారు.
అదే విధంగా ప్రస్తుతం ఉన్న రూ.150 అక్షరాభ్యాస మండపాన్ని బాలాలయం వద్ద ఏర్పాటు చేయనున్నారు. రూ.1000 ప్రత్యేక అక్షరాభ్యాసం, కుంకుమార్చన సేవల కోసం వేర్వేరు మండపాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రూ.150 అక్షరాభ్యాస మండపాన్ని ధ్యాన మందిరంలోకి మార్చనున్నట్లు ఈఓ పేర్కొన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు, టికెట్ కౌంటర్లు, ప్రసాద కౌంటర్లను సక్రమంగా ఏర్పాటు చేయనున్నట్లు ఇఓ అంజనీదేవి తెలిపారు.
