కుప్పంలో చారిత్రాత్మక పారిశ్రామిక అడుగు..

రూ.200 కోట్ల ఏబీఐఎస్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కుప్పం, చిత్తూరు : గుడుపల్లె మండలం పొగురుపల్లెలో రూ.200 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. 30.75 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమను సందర్శించిన ముఖ్యమంత్రి, ప్లాంట్‌లోని వివిధ విభాగాలను ప్రారంభించి పనితీరును పరిశీలించారు. కంపెనీ ప్రతినిధులు యూనిట్ ప్రత్యేకతలు, ఉత్పత్తి సామర్థ్యం, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను సీఎంకు వివరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచే రోజు అని పేర్కొన్నారు. వెనుకబడిన గుడుపల్లి మండలాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రాజెక్టు తొలి అడుగని చెప్పారు. ఈ పరిశ్రమ ద్వారా ఇప్పటికే 300 నుంచి 400 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని, పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత 700 మందికి ప్రత్యక్షంగా, మరో 700 మందికి పరోక్షంగా మొత్తం 1,400 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.

ఈ యూనిట్‌కు ప్రతి 60 రోజుల చక్రానికి దాదాపు 75 లక్షల కోళ్లు అవసరమవుతాయని, దీనివల్ల స్థానిక కోళ్ల పెంపకందారులకు స్థిరమైన మార్కెట్ ఏర్పడుతుందని సీఎం చెప్పారు. రైతులు సంస్థతో అనుబంధం ఏర్పరచుకుని కోళ్ల పెంపకం చేపడితే కొనుగోలు హామీతో పాటు సాంకేతిక సహాయం కూడా లభిస్తుందని పేర్కొన్నారు. పౌల్ట్రీ రంగంలో రైతులు పెట్టుబడి పెట్టేందుకు అవసరమైన ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోందని, పెట్టుబడి, నిర్వహణ వ్యయం, లాభదాయకతపై పూర్తి నమూనా రూపొందించి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.

పౌల్ట్రీ పరిశ్రమల ద్వారా కేవలం ఉద్యోగాలే కాకుండా గ్రామీణ యువత స్వయం ఉపాధి అవకాశాలను కూడా సృష్టించవచ్చని చంద్రబాబు అన్నారు. ఫీడ్ తయారీ, రవాణా, ఇతర అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని, భవిష్యత్తులో ఈ సంస్థ ఎగుమతుల దిశగా కూడా అడుగులు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతికతతో దేశంలోనే అతిపెద్ద చికెన్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఒకటిగా ఈ ప్లాంట్ నిలవడం ఆనందంగా ఉందని పేర్కొంటూ సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నాయని, ఇప్పటివరకు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకున్నామని సీఎం తెలిపారు. ఇప్పటికే రూ.11.5 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులు ఇచ్చామని, వాటి ద్వారా 10 లక్షలకు పైగా ఉద్యోగాలు లభించనున్నాయని చెప్పారు. రాయలసీమలోనే రూ.4.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా సుమారు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని వివరించారు.

కుప్పం నియోజకవర్గంలో 27 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేలకుపైగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. యువత నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి పరిశ్రమల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

గుడుపల్లి మండలానికి హంద్రీ-నీవా జలాలు తీసుకొచ్చామని, త్వరలో పరిశ్రమలకు, తాగునీటికి శాశ్వత పరిష్కారం కల్పిస్తామని చెప్పారు. జాతీయ రహదారులు, రైల్వే అనుసంధానం, భవిష్యత్ రవాణా సౌకర్యాలతో కుప్పం రాష్ట్రంలోనే అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతుందని అన్నారు. కుప్పాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ అమలు చేస్తోందని వెల్లడించారు.

రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం తరఫున రూ.40 వేల కోట్లు, ప్రైవేట్ రంగం నుంచి రూ.60 వేల కోట్ల పెట్టుబడులతో మొత్తం రూ.1 లక్ష కోట్ల వ్యయంతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. వ్యవసాయం, ఉద్యానవనం, పాడి, కోళ్ల పెంపకం, పట్టుపరిశ్రమ, సేవారంగం, పరిశ్రమలను సమన్వయం చేస్తూ సమగ్ర అభివృద్ధి సాధిస్తే కుప్పం రాష్ట్రంలోనే అత్యుత్తమ నియోజకవర్గంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.