క్రీడా ప్రాంగణంలో ప్లాట్ల రాళ్లు తొలగింపు

  • ఆంధ్రప్రభ కథనానికి స్పందన.. రంగంలోకి డి ఎల్ పి ఓ
  • ప్రభుత్వ భూమిపై అక్రమ ప్లాట్లకు బ్రేక్
  • అధికారుల చర్యతో తొలగించిన సరిహద్దు రాళ్లు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట మండలం, అక్కారం గ్రామంలోని క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా ప్లాట్లు చేసి సరిహద్దు రాళ్లు పాతిన వ్యవహారం ఆంధ్రప్రభ దినపత్రిక వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ఆంధ్రప్రభ వెలుగులోకి తీసుకురావడంతో సంబంధిత అధికారులు స్పందించారు. శుక్రవారం డివిజనల్ పంచాయతీ అధికారి వెంకటప్రసాద్ అక్కారం గ్రామానికి చేరుకుని క్రీడా ప్రాంగణానికి కేటాయించిన ఐదు గుంటల స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా పాతిన ప్లాట్ల రాళ్లను తొలగింపజేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు చేసే ప్రయత్నాలను ఉపేక్షించబోమని అధికారులు హెచ్చరించారు. గ్రామస్తులు అధికారుల తక్షణ స్పందనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, క్రీడా ప్రాంగణ భూమిని పరిరక్షించాలని కోరారు.