ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి..

  • మండల అంబెడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు అడ్వకేట్ సుంకరి విజయ్

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : భారత ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను అధికారులు, బీఎల్‌ఓలు ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు, అడ్వకేట్ సుంకరి విజయ్ కుమార్ అన్నారు.

శుక్రవారం కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో మండల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలోని ఆర్టికల్-326 ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి కుల, మత, ప్రాంత, లింగ, భాషా భేదాలు లేకుండా ఓటు హక్కు కల్పించారని గుర్తు చేశారు. ఆ హక్కును పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయడంతో పాటు, ఓటర్ల జాబితాలోని తప్పులను నిబంధనలకు అనుగుణంగా సరిదిద్దాలని సూచించారు. ఓటరు ఇంటికి వెళ్లినప్పుడు ఎన్యూమరేషన్ ఫారాలను అందించి, అవసరమైతే వాటిని పూర్తి చేయడంలో సహకరించాలని, ఫారాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా నింపేలా అవగాహన కల్పించాలని కోరారు.

అలాగే గ్రామాల వారీగా అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలకు సహకరిస్తూ ఎలాంటి తప్పులు లేకుండా ఎస్‌ఐఆర్ ఫారాలను నింపించి, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జత చేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కును పరిరక్షించి, ఒక్క అర్హుడి ఓటు కూడా కోల్పోకుండా చూడడం ప్రజాస్వామ్యవాదులందరి బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాన్ని ఎలా నింపాలనే విషయంపై సంఘ సభ్యులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షుడు, కమ్మర్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్, లెక్చరర్ సాయన్న, సంఘం కార్యదర్శి కొంటికంటి నరేందర్, కార్యవర్గ సభ్యులు బండి ఆంజనేయులు, బద్దం సంజయ్, దొన్పల్ రవి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.