89వ రాష్ట్ర శాప్ టోర్నీకి సన్నాహాలు ప్రారంభం
క్రీడాకారుల ఎంపికకు పారదర్శక చర్యలు
జిల్లాల వారీగా ట్రయల్స్ నిర్వహణ
అర్హులకే అవకాశం కల్పించాలని చైర్మన్ రవి నాయుడు ఆదేశాలు
జిల్లా కలెక్టర్లు, క్రీడాశాఖ అధికారులకు సూచనలు
విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 89వ రాష్ట్ర శాప్ టోర్నీ సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సన్నాహాలు ప్రారంభమైనట్లు శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. జిల్లా స్థాయిలో క్రీడా అభివృద్ధి కోసం క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా టోర్నీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. క్రీడాకారుల ఎంపికలో పూర్తి పారదర్శకత, నిబంధనల పాటింపు, ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్లు, జిల్లా క్రీడాశాఖ అధికారులు పరస్పర సమన్వయంతో ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించి, అర్హులైన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయాలని సూచించారు. ట్రయల్స్ నిర్వహణలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శాప్ మేనేజింగ్ డైరెక్టర్ భరణి ఎస్‌ఏఏపీ ఉన్నతాధికారులు, జిల్లా క్రీడాశాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని చైర్మన్ ఆదేశించారు.
