ప్రజా కవి గద్దర్‌కు ఘన నివాళులు
వర్ధంతి సందర్భంగా స్మరణ సభ నిర్వహించిన ఏఐవైఎస్ నాయకులు
చిట్యాల, ఆంధ్రప్రభ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రజా కవి గద్దర్ వర్ధంతి సందర్భంగా గురువారం చిట్యాల మండల కేంద్రంలో ఏఐవైఎస్ మండల అధ్యక్షుడు జన్నే యుగేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమానికి హాజరైన ఏఐవైఎస్ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య మాట్లాడుతూ, తన పాటనే ఆయుధంగా మలుచుకుని పీడిత వర్గాల గొంతుకగా నిలిచి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రజా యుద్ధనౌక గద్దర్ అని కొనియాడారు.
తన ఆట, పాటల ద్వారా సమాజంలో చైతన్యం నింపి, చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన నిలిచిన పోరాట యోధుడిగా గద్దర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. భావితరాలకు ఉద్యమ స్ఫూర్తిని అందించిన మహనీయుడిగా ఆయనను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎస్ మండల ప్రధాన కార్యదర్శి పుల్ల ప్రతాప్, మండల ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు, మండల నాయకులు గురుకుంట్ల కిరణ్, గుర్రపు తిరుపతి, పాముకుంట్ల చందర్ తదితరులు పాల్గొన్నారు.
