నాలుగు దశాబ్దాల నాటి సింగిల్ బ్రిడ్జి..

నాలుగు దశాబ్దాల నాటి సింగిల్ బ్రిడ్జి..

  • డబుల్ లైన్ వంతెన కోసం ప్రజల వేడుకోలు

మోత్కూర్, ఆంధ్రప్రభ : రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించి మోత్కూర్–గుండాల మండలాల మధ్య బిక్కేరు వాగుపై ఉన్న సింగిల్ లైన్ బ్రిడ్జిని డబుల్ లైన్ బ్రిడ్జిగా నిర్మించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

గత నాలుగు దశాబ్దాలుగా ఇదే వంతెనపై రాకపోకలు సాగుతున్నాయని, బిక్కేరు వరదల ప్రభావంతో ప్రస్తుతం బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగిల్ లైన్ వంతెన కావడంతో ఒక వైపు నుంచి భారీ వాహనం వస్తే మరోవైపు నుంచి వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నదని పేర్కొంటున్నారు.

ఒక వాహనం దాటిన తర్వాతే మరో వాహనం వెళ్లాల్సి రావడంతో తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే వంతెనకు ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడంతో వృద్ధులు, ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో గుండాల మండలం నుంచి ఇసుక లారీలు ఓవర్‌లోడ్‌తో ఈ వంతెనపై ప్రయాణించడం వల్ల బ్రిడ్జిపై గుంతలు ఏర్పడ్డాయని, వర్షాకాలంలో వాటిలో నీరు నిలిచి మరిన్ని ఇబ్బందులు కలిగిస్తున్నాయని చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే కుంభం కిశోర్‌కుమార్, ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామేల్ అసెంబ్లీలో పలుమార్లు బిక్కేరు వాగుపై డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేసినప్పటికీ, అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని స్థానికులు విమర్శిస్తున్నారు.

మోత్కూర్, గుండాల మండలాల ప్రజల రాకపోకలకు అత్యంత కీలకమైన ఈ వంతెన స్థానంలో డబుల్ లైన్ బ్రిడ్జిని తక్షణమే మంజూరు చేసి పనులకు శంకుస్థాపన చేయాలని ప్రజలు, ప్రయాణికులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Leave a Reply