గ్రామీణ విద్యార్థులను ప్రపంచ స్థాయి నిపుణులుగా తీర్చిదిద్దుతాం

పీయూసీ–1 విద్యార్థుల ఓరియెంటేషన్‌లో వైస్‌ చాన్సలర్ ప్రొఫెసర్ కే. గోవర్ధన్

బాసర, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను ప్రపంచ స్థాయి ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతామని ఆర్జీయూకేటీ వైస్‌ చాన్సలర్ ప్రొఫెసర్ కే. గోవర్ధన్ అన్నారు.

2026–27 విద్యా సంవత్సరానికి నూతనంగా చేరిన పీయూసీ–1 విద్యార్థులకు సోమవారం ఆర్జీయూకేటీలో ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ గుజ్జరి శంకర్ మాట్లాడుతూ.. నూతన విద్యార్థులు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులకు స్వాగతం పలికి, ఓరియెంటేషన్ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు. విద్యార్థులకు విశ్వవిద్యాలయ నియమ నిబంధనలు, అకాడమిక్ విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

అంతకుముందు వైస్‌ చాన్సలర్ ఓఎస్‌డీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వైస్‌ చాన్సలర్ ప్రొఫెసర్ కే. గోవర్ధన్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి, ప్రపంచ స్థాయి నైపుణ్యాలు కలిగిన నిపుణులుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

విద్యార్థులు సమయపాలన, క్రమశిక్షణ, నైతిక విలువలతో పాటు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అలవరచుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.

ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ ఈ. మురళీ దర్శన్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ నియమ నిబంధనలు, విద్యార్థుల బాధ్యతల గురించి వివరించారు.

అనంతరం వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. అకాడమిక్స్ అండ్ ప్లానింగ్ అసోసియేట్ డీన్ శ్రీ శేఖర్ శీలం విద్యా విధానం, అధ్యయన ప్రణాళిక, ప్రయోగశాలల వినియోగం, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాల గురించి వివరించారు.

సైన్సెస్ అండ్ హ్యూమానిటీస్ విభాగం అధ్యాపకులు పునాది విద్య, భాషా నైపుణ్యాలపై విద్యార్థులకు సమగ్రంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.