Rain Alert | తీవ్ర వాయుగుండం ప్రభావం..

పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు


ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మంగళవారం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసర ప్రాంతాలు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌ల కింద నిలబడవద్దని APSDMA సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.