సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై జీవీఎంసీ కమిషనర్ సమీక్ష

  • యాత్రా మార్గాన్ని పరిశీలించిన కేతన్ గార్గ్

విశాఖపట్నం, ఆంధ్రప్రభ: సింహాచలం గిరి ప్రదక్షిణ–2026కు సంబంధించి చేపడుతున్న పౌర సౌకర్యాల ఏర్పాట్లను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఐఏఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ యాత్రా మార్గాన్ని పరిశీలించి, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు.

యాత్రికుల కోసం తాగునీటి సౌకర్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపు షవర్లు, పారిశుధ్య ఏర్పాట్లు, కంట్రోల్ రూములు, దారి చూపే సూచిక బోర్డులు, వీధి దీపాలు తదితర ఏర్పాట్లను కమిషనర్ పరిశీలించారు. ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. భక్తులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, అవాంతరాలు లేని యాత్రా అనుభవం కల్పించేందుకు అవసరమైన అన్ని సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.