విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసిన ఎమ్మెల్యే..
నర్సాపురం, ఆంధ్రప్రభ : నరసాపురం పట్టణం ఎన్టీఆర్ కాలనీలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ , నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థినులకు నైట్ డ్రెస్సులు, టవల్స్, జంబుకానలు, స్వెట్టర్లు, రగ్గులను పంపిణీ చేశారు. అనంతరం వసతి గృహంలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని మంచి మార్కులు సాధించాలని ప్రోత్సహించారు. హాస్టల్ లో చదువుకున్న వారెందరో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని, అలాంటి ఉన్నత స్థాయికి మీరు చేరుకోవాలని చైతన్య పరిచారు.

విద్యార్థినులు ఉన్నతమైన విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అలాగే వసతి గృహంలో విద్యార్థినులకు నాణ్యమైన, పోషకాహారం అందించడంతో పాటు ప్రతి నెలా వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్యం, విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని వార్డెన్, సాంఘిక సంక్షేమ అధికారికి సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించేందుకు వారితో కలిసి భోజనం చేసి, భోజన నాణ్యతతో పాటు వసతి గృహంలోని సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహం పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుకోవాలని సూచించారు. హాస్టల్ విద్యార్థులను తమ స్వంత పిల్లలు వలె చూసుకోవాలని సిబ్బందికి సూచించారు.
