డాక్టర్ నిర్లక్ష్యంతో మృతి చెందిన ఐదు నెలల పాప..

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లాలోని మహావీర్ మెడికల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదు నెలల పసికందు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. వైద్యుడు సెల్‌ఫోన్‌లో నిమగ్నమై నిర్లక్ష్యంగా చికిత్స అందించడంతోనే తమ బిడ్డ మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు.
వివరాల్లోకి వెళ్తే.. నవాబుపేట మండలం మేనేపల్లి గ్రామానికి చెందిన దంపతులు తమ ఐదు నెలల పాప అనారోగ్యానికి గురికావడంతో చికిత్స కోసం మహావీర్ మెడికల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యుడు సెల్‌ఫోన్ చూస్తూనే వైద్యం నిర్వహించాడని, సరైన చికిత్స అందకపోవడంతో పాప మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
పసికందు మృతి చెందడంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పాప మృతికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు సమాచారం.
