రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు..

రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు..
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం గిలకలదిండిలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుని, అనంతరం మీడియాతో మాట్లాడారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏదో ఒక వివాదాన్ని సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఇటీవల కర్నూలులో జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం ఘటన వెనుక కూడా వైసీపీ కార్యకర్తలు లే పని అని అన్నారు
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలకు కొందరు కావాలనే పాల్పడుతున్నారని, ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.
అలాగే, తన మాజీ వ్యక్తిగత సహాయకుడు (పీఏ)కు సంబంధించిన కోట్ల రూపాయల ఆర్థిక వ్యవహారాల అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే డీఎస్సీ వంటి అంశాలపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు.
