తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం..

కృష్ణా జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశం.. – జిల్లా అభివృద్ధిపై సమీక్ష


మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో గురువారం జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పల హారిక అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో అభివృద్ధి పనులు, ముఖ్యంగా జిల్లా పరిషత్ సభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో ఎదురవుతున్న తాగునీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా తాగునీటి కొరత పై అధికారులను ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. అవసరమైన ప్రాంతాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో పాటు శాశ్వత పరిష్కార చర్యలు కూడా చేపడుతున్నామని వెల్లడించారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ప్రధాన కార్యనిర్వాహణ అధికారి (సీఈవో) మాట్లాడుతూ, జిల్లా పరిషత్‌కు చెందిన భూములను గుర్తించి వాటిలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రభుత్వ భూముల సంరక్షణకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. సమావేశంలో జిల్లా స్థాయి సంఘం సభ్యులు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.