600kilograms | దేశ రక్షణ, అంతరిక్ష రంగాల్లో ప్రధాన శక్తిగా ఏపీ

600kilograms | దేశ రక్షణ, అంతరిక్ష రంగాల్లో ప్రధాన శక్తిగా ఏపీ

600kilograms | ఆత్మ‌నిర్భ‌ర్‌ భార‌త్‌కు చిరునామా
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
పుట్ట‌ప‌ర్తి స‌భ‌లో సీఎం చంద్ర‌బాబు
ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టుకు సీఎం భూమి పూజ‌

600kilograms | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ఆధ్యాత్మిక న‌గ‌రిలో న‌వ శ‌కం ఆరంభం కాబోతోంద‌ని.. పుట్టపర్తి ఇకపై దేశ రక్షణ రంగంలో కీలక కేంద్రంగా అవతరించబోతోందని ఏపీ సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన పుట్టపర్తి, ఇకపై వ్యూహాత్మక రక్షణ శక్తికి కూడా కేంద్రబిందువుగా మారనుందని తెలిపారు. సత్యసాయి బాబా బోధనలతో విశ్వశాంతికి నిలయంగా నిలిచిన ఈ ప్రాంతం, ఆధునిక రక్షణ సాంకేతికతకు కూడా చిరునామాగా మారబోతుందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశ రక్షణ రంగానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులకు శుక్ర‌వారం ఘనంగా శ్రీకారం చుట్టారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలోని అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అదే వేదికపై కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ , హెచ్ ఎఫ్ సీఎల్ సంస్థలకు సంబంధించిన ప్రాజెక్టుల శిలాఫలకాలను వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు.

బంగారం ఉత్పత్తికి చిరునామాగా..
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ , “పుట్టపర్తి అనగానే సత్యసాయిబాబా గుర్తొస్తారు. తన బోధనలతో విశ్వశాంతికి కృషి చేశారు. ఆపరేషన్ సిందూర్ భారతీయులకు గర్వకారణం. కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ ద్వారా భారతదేశంలోనే ఆధునిక డ్రోన్ ఎకో సిస్టమ్కు శ్రీకారం చుట్టాం. రూ.686 కోట్లతో 8 సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయి. వీటి ద్వారా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒకప్పుడు రాయలసీమ అంటే రతనాల సీమ. ఒకానోక దశలో అనంతపురం ఎడారిగా మారిపోయింది. రాయలసీమ రూపు రేఖలు పూర్తిగా మార్చిన ఘనత ఎన్టీఆర్‌ది. సీమకు నీళ్లు తీసుకురావాలి, ప్రజల జీవితాలను మార్చాలని ఎన్టీఆర్ సంకల్పించారు. ఆయన శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం. సమర్థ‌ నీటి నిర్వహణతో సీమకు జలహారతి ఇచ్చాం. కేంద్రం సహకారంతో రాయలసీమ రూపు రేఖలు మారబోతున్నాయి. రాయలసీమను మళ్లీ రతనాలసీమ చేసే బాధ్యతను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. కడప స్టీల్ ప్లాంట్ పనులు జూన్లో ప్రారంభించి 2028 నాటికి నిర్మాణం పూర్తి చేసి రాయలసీమకు కానుకగా ఇస్తాం. దేశానికి ఏపీ రక్షణకవచంగా నిలబడుతోంది. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్.. ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్. ఈ ఏడాది జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్లో 600 కిలోలు, వచ్చే ఏడాది 1500 కిలోల బంగారం ఉత్పత్తి చేస్తాం. బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ మారబోతోంది” అని సీఎం అన్నారు.

ఆత్మ‌నిర్భ‌ర్‌గా భార‌త్
అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు దేశ రక్షణ స్వావలంబనకు కీలకమని సీఎం పేర్కొన్నారు. “ఆత్మనిర్భర్ భారత్” లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యపాత్ర పోషించబోతోందని చెప్పారు. అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్ల తయారీ, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్, ఫ్లైట్ టెస్టింగ్ వంటి హైటెక్ కార్యకలాపాలకు పుట్టపర్తి కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని, సుమారు 7,500 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు అత్యంత వేగంగా అనుమతులు ఇస్తోందని పేర్కొంటూ, కేవలం 36 రోజుల వ్యవధిలోనే ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు మంజూరు చేసి శంకుస్థాపన దశకు తీసుకువచ్చామని వివరించారు. “జెట్ స్పీడ్‌తో అనుమతులు ఇచ్చాం” అని వ్యాఖ్యానించారు.

డ్రోన్ సాంకేతిక‌త ..
దేశ భద్రతలో డ్రోన్ సాంకేతికత భవిష్యత్తులో కీలక పాత్ర పోషించబోతుందని చంద్రబాబు తెలిపారు. ఇటీవల జరిగిన “ఆపరేషన్ సింధూర్”లో వినియోగించిన కొన్ని డ్రోన్లు ఆంధ్రప్రదేశ్‌లోనే తయారై పరీక్షించబడ్డాయని వెల్లడించారు. రాబోయే కాలంలో డ్రోన్ టెక్నాలజీకి భారీ డిమాండ్ ఉంటుందని పేర్కొంటూ, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ప్రత్యేక డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ఏపీ ప్రధాన శక్తిగా..
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో దేశ రక్షణ, అంతరిక్ష రంగాల్లో ప్రధాన శక్తిగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. “శ్రీహరికోట అంతరిక్ష శక్తిగా, నాగాయలంక క్షిపణి శక్తిగా, పుట్టపర్తి రక్షణ శక్తిగా, విశాఖ నౌకాదళ శక్తిగా దేశానికి అండగా నిలుస్తాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను ప్రత్యేక రంగాల హబ్‌లుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాయలసీమ అభివృద్ధి అంశంపైనా సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. గతంలో “రతనాల సీమ”గా పేరుగాంచిన ఈ ప్రాంతం కరవు కారణంగా వెనుకబడిపోయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతి ఎకరాకు నీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందన్నారు. అనంతపురం జిల్లాలోని కియా పరిశ్రమకు అవసరమైన నీటి సరఫరా కూడా ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించిందని గుర్తుచేశారు.

ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊపు
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు లక్ష కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని సీఎం వెల్లడించారు. వ్యవసాయం, పరిశ్రమలు, రక్షణ రంగం, సాంకేతికత – ఈ నాలుగు రంగాలను సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలిపారు. పుట్టపర్తిలో ప్రారంభమైన ఈ రక్షణ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మాత్రమే కాకుండా దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో కూడా కీలక పాత్ర పోషించనున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో భారీ పరిశ్రమలు, రక్షణ రంగ సంస్థలు రావడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.

CLICK HERE TO READ Medicine Centers | ప్రైవేట్ కు.. చెక్

CLICK HERE TO READ MORE

Leave a Reply