గుంటూరు పచ్చదనానికే పెద్దపీట
గుంటూరు పచ్చదనానికే పెద్దపీట
ప్రజల సహకారంతో నగరాభివృద్ధి
రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ
గుంటూరు, ఆంధ్రప్రభ: గుంటూరు నగరాన్ని మరింత పచ్చదనంతో, పరిశుభ్రతతో తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపార సంస్థలు సమన్వయంతో పనిచేస్తే నగరాభివృద్ధి వేగవంతమవుతుందని ఆయన అన్నారు.
నగరంలోని బృందావన్ గార్డెన్స్‌లో ఉన్న సత్య ఇన్వెస్టిగేషన్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సంస్థ డైరెక్టర్ శంకరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాష్యం రామకృష్ణను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రామకృష్ణ, గుంటూరులో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పచ్చదనం పెంపు, పరిశుభ్రత మెరుగుదలకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో నగరాన్ని ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు.
మాజీ మంత్రి డాక్టర్ మాకినేని పెదరత్తయ్య మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పనిచేస్తేనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విశ్రాంత పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పెదనందిపాడు విద్యాసంస్థల చైర్మన్ కాళహస్తి సత్యనారాయణ మాట్లాడుతూ భాష్యం రామకృష్ణ సేవలను గుర్తించి టీడీపీ రాజ్యసభకు పంపడం అభినందనీయమన్నారు.
హైకోర్టు న్యాయవాది శామ్యూల్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి నుంచి ఎదిగి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడం విద్యారంగానికి దక్కిన గౌరవమని అభిప్రాయపడ్డారు. భాష్యం విద్యాసంస్థల ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు విద్యా సేవలు అందిస్తున్నారని పలువురు వక్తలు కొనియాడారు.
కార్యక్రమంలో శ్రీశైలం బోర్డు డైరెక్టర్ బోడేపూడి వెంకటసుబ్బారావు, ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి వజ్జా రామకృష్ణ, విశ్రాంత లెక్చరర్ రాయుడు తదితరులు ప్రసంగించారు. అనంతరం ఎంపీ భాష్యం రామకృష్ణ, డాక్టర్ మాకినేని పెదరత్తయ్యలను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మలినేని కాలేజీ చైర్మన్ డాక్టర్ పెరుమాళ్లు, పెదనందిపాడు విద్యాసంస్థల ప్రిన్సిపాల్ డాక్టర్ వీరరాఘవయ్య, భాష్యం హనుమంతరావు, మాజీ ఎంపీపీ నర్రా బాలకృష్ణ, కళాశాల సహాయ కార్యదర్శి నర్రా రాఘవయ్య, టీడీపీ మైనార్టీ నాయకుడు లాల్ వజీర్, భాష్యం కళాశాల ప్రిన్సిపాల్ శివ, ఇంగ్లీష్ ప్రొఫెసర్ సుదర్శన్, విశ్రాంత ఎస్పీ వై.టి. నాయుడు, డీఎస్పీ బీరం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
