విస్తృత అవగాహనతోనే విపత్తుల నుంచి రక్షణ…

విస్తృత అవగాహనతోనే విపత్తుల నుంచి రక్షణ…
జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న ఫామెక్స్)-2026
ఈ నెల 28వ తేదీ వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు
ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : విపత్తులపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఎన్‌డీఆర్ఎఫ్, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలోని ఫెమిలియరైజేషన్ ఎక్సర్‌సైజ్(ఫామెక్స్)-2026లో భాగంగా గురువారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. ఎన్‌డీఆర్ఎఫ్ టీమ్ కమాండర్, ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. జిల్లాలో వరదలు, అగ్నిప్రమాదాలు వంటి విపత్తులకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించారు.
జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళికపైనా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఫామెక్స్)-2026లో భాగంగా మాక్‌డ్రిల్స్‌తో పాటు భూకంపాలు, వరదలు, అగ్నిప్రమాదాలు వంటి విపత్తుల సమయంలో జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్ఎఫ్) కార్యకలాపాలపైనా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. విపత్తులపై సరైన అవగాహన, ముందస్తు సన్నద్ధతతోనే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనగలమని..
ఈ క్రమంలో సామాజిక చైతన్యం లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ, అగ్నిమాపక, పంచాయతీరాజ్, పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ తదితర సమన్వయ శాఖల అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు వివరించారు. ఈ నెల 28 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
