పోలీస్ ప్రమోషన్స్ లో పరేషాన్

పోలీస్ ప్రమోషన్స్ లో పరేషాన్
మల్టీజోన్-1,జోన్-2 వారికి నష్టం
హైదరాబాద్, సైబరాబాద్ రేంజ్లో వేకన్సీ అవకాశాలు
జూనియర్లకు సెల్యూట్ కొట్టే పరిస్థితులు
ట్రైనింగ్ నుండే సీనియార్టీని ఫిక్స్ అప్ చేయాలి
2017 నుండి ఏఆర్ నుంచి సివిల్‌కు కన్వర్షన్ పెండింగ్
డిపార్ట్మెంట్ లోపాలను ఎత్తి చూపిన ఎమ్మెల్యే నాగరాజు
ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ : ఒకే రాష్ట్రంలోని,ఒకే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న అధికారుల పదోన్నతులపై వివక్షత కొనసాగుతోంది. జోన్ల వారిగా పని చేస్తున్న ఒకే బ్యాచ్ లో శిక్షణ పొందిన వారికి సీనియార్టీ ప్రకారం ప్రమోషన్స్ లభించకుండ, జోన్ల వారిగా ఖాళీ అయ్యే పోస్టులను బట్టి పదోన్నతులు కల్పించే సిస్టం కొనసాగింపుతో అంతరాలు పెరుగుతున్నాయి. జూనియర్లకు ప్రమోషన్స్ లభించడంతో సీనియర్లు సెల్యూట్ కొట్టే విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
ఇదంతా క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకొనే పోలీస్ శాఖలో తారతమ్యా,బేధాలు నెలకొంటున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి…పాలకులు, అధికారులు మారుతున్నారు తప్ప…పోలీస్ డిపార్ట్మెంట్ లోని లోపాలను సరిదిద్దే ప్రయత్నాలు చేపట్టడం లేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డేయే హోమ్ మినిష్టర్ వ్యవహారాలు చూస్తుండటంతో మరొకసారి పోలీస్ శాఖలోని లోటుపాట్లను విశ్రాంత ఐపీఎస్ ఆఫీసర్ కె ఆర్ నాగరాజు ఎత్తి చూపారు. గురువారం శాసనసభలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజుమల్టీజోన్-1, జోన్-2 పోలీస్ అధికారుల పదోన్నతుల విషయంలో జరుగుతున్న అన్యాయాలను ప్రస్తావించారు.
పోలీస్ శాఖలో జోన్ల వారిగా కొనసాగుతున్న ప్రమోషన్ల వల్ల ఒకే రాష్ట్రంలోని,ఒకే బ్యాచ్ వారికి సమాన ప్రమోషన్స్ లభించక కొనసాగుతున్న అసమానతల అంశంపై అసెంబ్లీలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సభ దృష్టికి తీసుకువచ్చారు.పోలీస్ డిపార్ట్మెంట్ ప్రమోషన్ల విషయంలో మల్టీజోన్-1, జోన్-2 వారి కంటే హైదరాబాద్, సైబరాబాద్ రేంజ్లో పని చేసే పోలీస్ ఆఫీసర్స్ కు వేకెన్సీ అవకాశాలు ఎక్కువగా లబిస్తూ పదోన్నతులు పొందుతున్న విషయాలను ఎత్తి చూపారు. హైదరాబాద్, సైబరాబాద్ జోన్స్ లో విధులు నిర్వర్తించే పోలీస్ అధికారులకు తొందరగా ప్రమోషన్లు వస్తున్నాయన్నారు.
ప్రమోషన్స్ పొంది సిఐలు, డిఎస్పీలు కాగానే సేమ్ బ్యాచ్ లో ఉన్న మల్టీజోన్-1, జోన్-2 పోలీస్ అధికారులకు తప్పని పరిస్థితుల్లో సెల్యూట్ కొట్టే విషమ పరిస్థితులు ఎదురై ఇబ్బందులు,అవమానాలు పడుతున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. గతంలో తాను పోలీస్ శాఖలో పని చేశానని, ఈ అంశంపై అప్పుడే మాజీ ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశామని గుర్తు చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి వినతిపత్రం అందజేశామని పేర్కొన్నారు. ట్రైనింగ్ నుండే సీనియార్టీని ఫిక్స్ అప్ చేస్తే, అంతరాలు,అసమానతలు తొలగి పోతాయన్నాయన్నారు.
మహారాష్ట్ర, చెన్నై రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతులను తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఆచరిస్తే ప్రమోషన్స్ పై ఉన్న అపోహలు తొలగిపోయి పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేసే అధికారులందరికి సమాన న్యాయం చేకూరుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు సూచించారు. ఈ అంశంపై ఉన్న ఫైల్ పెండింగ్లో ఉందని, వెంటనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు.అలాగే ఏఆర్ నుంచి సివిల్‌కు కన్వర్షన్ అయ్యే కానిస్టేబుళ్ల అంశం కూడా 2017 నుంచి పెండింగ్ లోనే ఉందని ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు ఎత్తి చూపారు. దీనిపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.
