రామగుండంలో సెల్ టవర్ ఎక్కిన ఎక్సైజ్ కానిస్టేబుల్

రామగుండంలో సెల్ టవర్ ఎక్కిన ఎక్సైజ్ కానిస్టేబుల్
భార్య తరపున మధ్యవర్తుల వేధింపులతో వేదన!
న్యాయం కోసం గంటలపాటు ఆందోళన
గోదావరిఖని, ఆంధ్రప్రభ : భార్యతో గొడవలు…. భార్య తరఫున కుటుంబ సభ్యుల మధ్యవర్తుల వేధింపులు…. చివరకు తన కన్న కూతుర్ని తనకి ఇప్పించాలంటూ గగ్గోలు పెడుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ సెల్ఫోన్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోనీ జెన్కో కాలనీలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. భార్య అక్రమ సంబంధం వ్యవహారమే గొడవలకు దారి తీయడంతో పాటు తనను మానసిక ఆందోళనకు గురిచేస్తుందని మొరపెట్టుకున్నాడు.
రామగుండం పట్టణానికి చెందిన నహీం ధర్మపురిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఇతనికి రామగుండం పట్టణానికి చెందిన నికిత సింగ్ అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకోగా…. వీరి వైవాహిక జీవితం కొంతకాలం సజావుగానే ఉందని, మాకు ఒక పాప కూడా పుట్టినట్లు నయం పేర్కొన్నాడు. అయితే…. రాజకీయ ప్రతినిధికి చెందిన అనుచరుడు తమ కుటుంబంలోకి ప్రవేశించి మా వైవాహిక జీవితానికి అడ్డంకిగా మారడంతో పాటు వేధింపులకు గురి చేస్తున్నాడని ఎక్సైజ్ కానిస్టేబుల్ నహీం అక్కడికి వచ్చిన పోలీస్ అధికారులకు మొర పెట్టుకోవడం కనిపించింది.
తన భార్య ప్రియుడు వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదనతో మాట్లాడాడు. పద్ధతి మార్చుకోవాలంటూ భార్య నికిత సింగ్ కు వార్నింగ్ ఇచ్చినప్పటికీ మార్పు రాకపోవడంతో పుట్టింటికి పంపించినట్లు ఆయన చెప్పారు. తన పాపను తనకు ఇవ్వాలంటూ పలుమార్లు పోలీసులను సంప్రదించిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తన కూతుర్ని తనకు ఇప్పించాలంటూ నహీం సెల్ టవర్ కి గంటలపాటు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు, మధ్యవర్తులు న్యాయం చేయకపోవడంతో సెల్ ఫోన్ టవర్ ఎక్కి నిరసనకు దిగినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు తనకు న్యాయం చేయాలని, పాపను తనకు ఇప్పించాలని నయీమ్ ఈ సందర్భంగా పోలీసులను వేడుకున్నారు.
